Begin typing your search above and press return to search.

నేనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   27 Sep 2021 9:30 AM GMT
నేనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు: మంచు విష్ణు
X
ఒకప్పుడు 'మా' అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు ఎంతో సందడిగా జరిగిపోయేవి. ఆ ఎన్నికల ముందు కాస్త హడావిడి కనిపించేదేమో. ఆ తరువాత నుంచి 'మా' ఎన్నికలు గురించి సినిమావాళ్లు మాత్రమే కాకుండా, అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. సినిమాల్లో కలిసి నటిస్తూ కథలను నడిపిస్తూ .. పాత్రలకు ప్రాణం పొసే నటీనటులు, వర్గాలుగా విడిపోవడాన్ని వార్తల్లో చూస్తూ జనం బాధపడిపోతున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు .. ఒకరిని ఒకరు లైవ్ కి లాగేస్తున్న ధోరణి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సారి 'మా' అధ్యక్ష్య పదవి కోసం బరిలోకి దిగినవారిలో మంచు విష్ణు ఉన్నాడు.

తాము ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పేయడం మంచు ఫ్యామిలీకి అలవాటు. మోహన్ బాబు నుంచి ఆ ధోరణి ఆయన పిల్లలకు కూడా వచ్చింది. నిన్నమొన్నటి వరకూ తన సినిమాల గురించి .. అప్పుడప్పుడు తమ విద్యాలయం గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చిన విష్ణు, 'మా' అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగిన తరువాత తన ఫోర్స్ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గారు .. పవన్ కల్యాణ్ గారు కూడా తనకి ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మరో హాట్ టాపిక్ కి తెరతీశాడు.

'మా' అధ్యక్ష పదవిని ఇంతకుముందు ఎంతో మంది అతిరథమహారథులు నిర్వహించారు. అలాంటి పదవికి పోటీ చేయడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. అదే సమయంలో ఇండస్ట్రీ అనే మా ఇంటి విషయాలు రోడ్డెక్కుతున్నందుకు బాధగాను ఉంది. మా నాన్నగారు .. చిరంజీవిగారి మధ్య విభేదాలే 'మా' ఎన్నికలు ఇంత గొడవగా మారడానికి కారణమనే మీ అభిప్రాయం తప్పు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు .. వాళ్ల మధ్యకి వెళ్లినవారు ఫూల్స్ అవుతారు. నాన్నగారు .. చిరంజీవిగారి మధ్య పాత గొడవలు చల్లారలేదనేది మీడియా క్రియేట్ చేస్తున్నదే.

నేను ఎలాంటి వాడిననేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు .. ఎలాంటి తప్పు చేయనని తెలుసు. ఇక ఇప్పుడున్నవారిలో ఎవరు వచ్చినా, నా అంతటి సమర్థవంతంగా పనిచేస్తారని నమ్మకం నాకు లేదు. అందుకే నేను పోటీకి దిగవలసి వచ్చింది. చిరంజీవిగారు .. పవన్ కల్యాణ్ గారు కూడా నాకు ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టా? ఆయన వెనక ఉండి నడిపిస్తున్నవారు ఓడిపోయినట్టా? అనే మీ ప్రశ్నకి సమాధానం ఇండస్ట్రీలోని వారికే తెలియాలి. ఇండస్ట్రీని నేను ఒక కుటుంబంగా భావిస్తుంటాను .. లోపల జరిగే వ్యవహారాలు ఎలాంటి పరిస్థితుల్లోను నా ద్వారా మాత్రం బయటికి రావు. 'మా' అధ్యక్షుడిగా నేను ఎన్నికైతే, 'మా'కు అవసరమైన భవనాన్ని 'సొంత ఖర్చుతో నిర్మిస్తాను .. అవసరమైతే అప్పుచేసైనా ఆ పని పూర్తి చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.