Begin typing your search above and press return to search.

కేటీఆర్.. జగన్ లతో తనకున్న రిలేషన్ చెప్పిన మంచు విష్ణు

By:  Tupaki Desk   |   22 July 2021 4:47 AM GMT
కేటీఆర్.. జగన్ లతో తనకున్న రిలేషన్ చెప్పిన మంచు విష్ణు
X
‘మా’ ఎన్నికల ఎపిసోడ్ లో అనూహ్యంగా తెర మీదకు వచ్చి.. అందరి నోళ్లలో నానుతున్నారు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానంటూ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. అధ్యక్ష పోటీకి తాను సిద్ధమంటూ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు మంచు విష్ణు. కట్ చేస్తే.. అప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే.

ఓపక్క పోటీ చేస్తానంటూనే మరోవైపు ఒక కండిషన్ చెప్పి.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అంశాన్ని చెబుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి.. మురళీమోహన్.. తన తండ్రి లాంటి పెద్దలంతా కలిసి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని చెప్పిన విష్ణు.. అందుకు భిన్నంగా జరిగితే మాత్రం తాను పోటీలో ఉంటానని తేల్చేశారు.

తనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో ఉన్న రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి కేటీఆర్ తో తనకు సాన్నిహిత్యం ఉందని.. జగన్ అన్నను అడిగే చనువు ఉందని.. అందరినీ కలిసి ‘మా’ కు కావాల్సిన దాన్ని సాధించుకోవటానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మా భవనాన్ని కట్టిస్తానని తాను చేసిన ప్రకటనకు నాగబాబు స్పందిస్తూ.. స్థలం లేకుండా బిల్డింగ్ ఎక్కడ కడతారని చేసిన వ్యాఖ్యపై విష్ణు రియాక్టు అయ్యారు.

స్థలం లేకుండా బిల్డింగ్ ఎక్కడ కడతారని నాగబాబు అడిగారని.. సమయం వచ్చినప్పుడు ఆయనకు సమాధానం చెబుతానని చెప్పిన విష్ణు.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 2016లోనే తనను ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉండాలని తనను సీనియర్లు మురళీమోహన్.. దాసరి నారాయణరావు తదితర పెద్దలు చెప్పారని.. అయితే.. తన తండ్రి కల్పించుకొని.. ‘విష్ణుది చిన్నవయసు వద్దు’ అని అందరికి నచ్చజెప్పారన్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని.. తన సోదరి మంచులక్ష్మిని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నకున్నారన్నారు.

ఈ ఏడాదిలో సినీ పరిశ్రమకు కొందరు పెద్దలు తనను అధ్యక్షుడిగా పోటీ చేయాలని అడిగారని.. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత తన పోటీ గురించి చెప్పాలని అనుకున్నానని.. అయితే.. మారిన పరిస్థితుల కారణంగా తను ముందే ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తనను పోటీ చేయమని కోరిన వారి పేర్లను తర్వాత చెబుతానని చెప్పిన విష్ణు.. తాను పోటీ చేస్తే నూటికి నూరుశాతం గెలుస్తానని.. అయితే ఎలా గెలుస్తానన్న విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పనని చెప్పటం గమనార్హం.