Begin typing your search above and press return to search.

అసెంబ్లీ రౌడీ లింక్... ఓటర్ మేకర్లకు నోటీసులు

By:  Tupaki Desk   |   3 May 2019 1:20 PM GMT
అసెంబ్లీ రౌడీ లింక్... ఓటర్ మేకర్లకు నోటీసులు
X
మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' చిత్రం విడుదల విషయంలో దాదాపు రెండేళ్ళ జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయినా సినిమా విడుదల అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. అసలే విడుదల విషయంలో అనుమానాలు ఉంటే ఇప్పుడు గోరుచుట్టుపై రోకటి పోటులా దర్శక నిర్మాతలకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి.

దర్శకుడు కార్తీక్ రెడ్డి.. నిర్మాత పూదోట సుధీర్ లపై మంచు విష్ణు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ అయ్యాయి. 'ఓటర్' సినిమాలో చాలా సీన్లు మోహన్ బాబు సూపర్ హిట్ సినిమా 'అసెంబ్లీ రౌడీ' నుంచి తీసుకున్నారట. దీనికోసం కార్తీక్ రెడ్డి 'అసెంబ్లీ రౌడీ' నిర్మాతలైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారికి(అంటే మోహన్ బాబు తనయుడు విష్ణుకు) కు 1.5 కోట్లు చెల్లించి 'అసెంబ్లీ రౌడీ' రైట్స్ తీసుకునేలా ముందుగా ఒప్పందం చేసుకున్నారట. కానీ ఇప్పుడు 'ఓటర్' సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ఆ డబ్బు ఇవ్వకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని విష్ణు తన నోటీసులో తెలిపాడు.

ఇదిలా ఉంటే మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాకు.. 'ఓటర్' సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదని దర్శక నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. 'అసెంబ్లీ రౌడీ'ని 'ఓటర్' పేరుతో అడాప్ట్ చేయాలని తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారుని వారు అంటున్నారు. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా ఉండడంతో కథ.. స్క్రీన్‌ప్లే క్రెడిట్స్‌ను తనకు ఇవ్వాలని విష్ణు తమను డిమాండ్ చేశాడని.. ఆయన బెదిరింపులు.. ఒత్తిడి తట్టుకోలేక స్క్రీన్ ప్లే రైటర్‌గా మంచు విష్ణు పేరు వేశామని దర్శకుడు కార్తీక్ రెడ్డి.. నిర్మాత పూదోట శ్రీధర్ కుమార్ ఆరోపిస్తున్నారు.

అయితే ఈ విషయంలో విష్ణు తరఫున నోటీసులు పంపిన విష్ణు ఫ్రెండ్ విజయ్ కుమార్ రెడ్డి దర్శక నిర్మాతల ఆరోపణలు అసత్యాలని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే వివాదం కోర్టులో ఉన్నందున.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినిమాను రిలీజ్ చేయరాదని సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 3వ తేదీన దర్శక నిర్మాతలు కోర్టు ముందు హాజరు కావాలని.. ఈ కేసును సెక్షన్ 805 కింద విచారణ జరుపుతామని నోటీసుల్లో పేర్కొన్నారుl