Begin typing your search above and press return to search.

అప్పట్లో రెండు సార్లు ట్రై చేసినా కాలేదట.. మణి నోట నాటి మాటలు

By:  Tupaki Desk   |   4 Oct 2022 11:30 AM GMT
అప్పట్లో రెండు సార్లు ట్రై చేసినా కాలేదట.. మణి నోట నాటి మాటలు
X
దేశంలో గర్వించదగ్గ సినీ దర్శకుల జాబితాలో తొలి వరుసలో ఉంటారు మణిరత్నం. ఎవరో చెప్పారని.. ట్రెండ్ మారిందని ఆయన తన సినిమాను తీసే పద్దతిని మార్చుకోరు. అలా అని.. మారిన కాలానికి తగ్గట్లు తాను మారకుండా మూస ధోరణిలో సినిమాలు చేసే తీరు ఆయనలో ఉండదు. కుర్ర దర్శకులు సైతం టచ్ చేయని అంశాల్ని తన సినిమాల్లో స్పృశించే అరుదైన దర్శకుడిగా ఆయన్ను చెప్పాలి. సిక్ట్సీ ప్లస్ లోనూ ఆయన సినిమాలు తీసే పద్దతి చూస్తే.. ఇంత అప్డేటెడ్ గా ఉండే మణిరత్నంను 'సార్' అనకుండా ఉండలేం. సినిమాల్లో మాస్టర్ పీసులు కొన్నే ఉంటే.. తాను తీసే ప్రతి సినిమాను క్లాసిక్ మాస్టర్ పీస్ లా మార్చే అరుదైన తత్త్వం మణిసార్ సొంతం.

తాజాగా ఆయన కలల పంటగా చెప్పుకునే పీఎస్ 1 అలియాస్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ విజయాన్ని అస్వాదిస్తున్నారు. రిలీజ్ అయినంతనే ఈ మూవీ మీద మిక్సైడ్ టాక్ ఉన్నప్పటికీ.. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మూవీ గొప్పతనాన్ని కీర్తిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే వసూళ్ల పరంగా తన పాత మూవీ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ దూసుకెళుతున్న ఈ మూవీకి భారీ కలెక్షన్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది. దశాబ్దాల తరబడి ఈ మూవీని తెరకెక్కించాలన్న కోరికను మణిరత్నం ఎట్టకేలకు తీర్చుకున్నారు.

తాజాగా విజయానందాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానీ సినిమాను తీయాలని బలంగా ప్రయత్నించానని చెప్పారు. గతంలో రెండుసార్లు ప్రయత్నించినా కుదర్లేదన్నారు.

'ఈ సినిమా తీసేందుకు 1994, 2011లో రెండు సార్లు ప్రయత్నించా. కానీ కొన్ని కారణాలతో ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాను తీసేందుకు నేనే కాదు.. నాతో పాటు చాలామంది ప్రయత్నించారు. కానీ.. సాధ్యం కాలేదు. కల్కి క్రిష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం. ప్రజల మనసులకు చాలా బాగా చేరువైంది. చాలా మంది మాదిరే నాకీ నవల ఇష్టం. అందుకే సినిమాగా తీయాలనుకున్నా. చాలా కాలం వెయిట్ చేశా. ఒక విధంగా ఆలస్యం కావటం మంచిదే అయ్యింది. ఈ సినిమాను టెక్నికల్ గా ఎలాంటి రాజీ లేకుండా చేయగలిగాం' అంటూ చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ మూవీని తీసేందుకు ఆయన దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మణిరత్నం సతీమణి.. సీనియర్ నటి సుహాసిని మాట్లాడుతూ.. తమ పెళ్లికి ముందు ఈ నవలను ఆమె చేతిలో పెట్టి.. ఓపీనియన్ అడిగిన వైనాన్ని గుర్తు చేసుకోవటం తెలిసిందే.

తనను అభిప్రాయం అడిగితే.. సింగిల్ లైన్ రాసిచ్చానని.. ఆ తర్వాత తనను రిజెక్టు చేస్తారని భయపడిన వైనాన్ని చెప్పటం తెలిసిందే. అప్పటి నుంచి దీన్ని సినిమాగా తీయాలన్న మణిరత్నం కోరిక తాజాగా తీరటం.. ఆయన అంతలా ప్రేమించిన ఈ మూవీకి అంతేలా ప్రేక్షకాదరణ లభించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.