Begin typing your search above and press return to search.

మణిశర్మ ప్రకంపనలు రేపుతున్నాడు

By:  Tupaki Desk   |   18 Jun 2016 5:13 AM GMT
మణిశర్మ ప్రకంపనలు రేపుతున్నాడు
X
బ్యాగ్రౌండ్ స్కోర్.. దీని గురించి కాస్త సాధారణంగా సినిమా నాలెడ్జ్ ఎక్కువున్న వాళ్లు మాత్రమే మాట్లాడుకుంటారు. సామాన్య ప్రేక్షకులు దీని గురించి పట్టించుకోరు. మాట్లాడరు. కానీ ‘జెంటిల్ మన్’ సినిమా చూసిన వాళ్లు మాత్రం ‘‘బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందిబ్బా’’ అని మాట్లాడ్డం గమనించవచ్చు. సోషల్ మీడియాలో కూడా మణిశర్మ ప్రస్తావన లేకుండా ‘జెంటిల్ మన్’ చర్చలు ముగియట్లేదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించాడు మెలోడీ బ్రహ్మ. సరైన అవకాశం దొరకాలే కానీ.. తాను ఎంతగా ఓ సినిమాపై ప్రభావం చూపించగలనో.. ఆ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లగలనో చూపించాడు మణిశర్మ. టైటిల్స్ దగ్గర్నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశంలో.. ప్రతి పాటలో తన ప్రత్యేకత చూపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు మణిశర్మ. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో ‘జెంటిల్ మన్’కు ఆయన ప్రాణం పోశాడు అంటే అతిశయోక్తి కాదు. ‘జెంటిల్ మన్’ థీమ్ మ్యూజిక్ అయితే ప్రేక్షకులకు ఒక రకమైన ఉద్వేగాన్ని తీసుకొస్తోంది. థియేటర్ల నుంచి వచ్చేశాక కూడా వెంటాడుతోంది. కీలక సన్నివేశాల్లో కొన్ని సెకన్లు చెవులు మూసుకుని సినిమా చూస్తే తెలుస్తుంది మణి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఏ రకంగా హెల్ప్ అయిందన్నది.

నిజానికి ‘జెంటిల్ మన్’ సినిమాకు మణిశర్మను ఎంచుకున్నపుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఔట్ డేట్ అయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారేంటని. అలాంటివాళ్లందరూ ఇప్పుడు లెంపలేసుకుంటున్నారు. తనను ఎగ్జైట్ చేసే సబ్జెక్టు దొరకట్లేదు తప్ప.. అలాంటి సినిమా పడితే ఎలా చెలరేగిపోతానో మణిశర్మ చూపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా కొన్నేళ్లుగా మణిశర్మ బాగా వెనుకబడ్డా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. టెంపర్ లాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించి తన ప్రత్యేకత చాటుకుంటూనే వస్తున్నాడు మణి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయనపై ఇండస్ట్రీ జనాల్లో ఇప్పటికీ చాలా అంచనాలే ఉన్నాయి. ఐతే ఇప్పుడు సాధారణ ప్రేక్షకులు కూడా ఆయన ప్రత్యేకతను గుర్తించారు. ‘జెంటిల్ మన్’ మణిశర్మ కెరీర్ కు మరో మలుపు అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.