Begin typing your search above and press return to search.

నాన్న గారిలా చేయలేం

By:  Tupaki Desk   |   18 Jan 2018 7:21 AM GMT
నాన్న గారిలా చేయలేం
X

300 పైగా సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ గా మాత్రమే కృష్ణ గారి గురించి ఇప్పటి జెనరేషన్ కు తెలుసు. ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి అడుగు పెడుతున్న తరానికి ఆయన మహేష్ బాబు తండ్రి - ఒకప్పటి స్టార్ హీరో అని తెలుసు. అంతే. కాని అంతకు మించి ఆయనకున్న గొప్ప వ్యక్తిత్వం గురించి అప్పట్లో ఆయనతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలను అడిగితే తెలుస్తుంది.

నిర్మాతలు ఎవరైనా కష్టాల్లో ఉన్నా - ఇబ్బందుల్లో ఉన్నా తన రెమ్యునరేషన్ అడిగి తీసుకోవడానికి కూడా మొహమాటపడేవారని ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు చెబుతారు. తాను హీరోగా నటించిన సినిమా ఫెయిల్ అయితే పారితోషికంలో కొంత భాగం వెనక్కు ఇవ్వడమో లేదా బాలన్స్ అమౌంట్ ఇవ్వకపోయినా అడగకపోవడమో చేసేవారట. ఏడాదికి 14 సినిమాలు చేసిన అరుదైన రికార్డులు ఎన్నో ఆయన పేరిట ఉన్నాయి. సింహాసనం - మోసగాళ్ళకు మోసగాడు - అల్లూరి సీతారామ రాజు సినిమాలు టేకప్ చేసినప్పుడు బయటి నిర్మాతలు అయితే సినిమా ఫ్లాప్ అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్ని తన బ్యానర్ మీదే నిర్మించుకున్నారు ఆయన.

ఇప్పుడు తరం మారింది. వారి అబ్బాయి మహేష్ బాబు సూపర్ స్టార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాని అప్పటిలా ఇప్పుడు ఆయన స్వభావాన్ని మాత్రం క్యారీ చేయలేకపోతున్నారు. దానికి కారణం మహేష్ సోదరి ‘మనసుకు నచ్చింది’ దర్శకురాలు మంజుల స్వయంగా షేర్ చేసుకున్నారు. నాన్నగారు అప్పట్లో మొహమాటానికి కూడా కొన్ని సినిమాలు చేసారని - తనకు ఎంత రిస్క్ అయినా ఫ్యామిలీని వదిలేసి మరీ డే అండ్ నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవారని, కాని మహేష్ కాని తాను కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉండలేమని - బాగా ఎగ్జైట్ చేస్తే తప్ప లేదా నచ్చితే తప్ప ఎవరికి మాట ఇచ్చే పరిస్థితి లేదన్నారు

మంజుల మాటల్లో నిజం లేకపోలేదు. సినిమా నిర్మాణం రోజురోజుకి కత్తి మీద సాములా మారుతున్న తరుణంలో మహేష్ బాబు లాంటి హీరోలకు ఏడాది ఒక్క సినిమా చేయటమే యుద్ధంగా మారింది. అలాంటిది కృష్ణ గారిలా ఏవేవో కారణాలతో సినిమాలు ఒప్పేసుకుని వరసబెట్టి చేసుకుంటూ పోయే పరిస్థితి లేదు. ఇది మహేష్ కు మాత్రమే ఉన్న సమస్య కాదు - ఏ స్టార్ హీరో అయినా మహా అయితే సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తే గొప్ప అనే దాకా వచ్చింది. మార్పులకు తగ్గట్టు సర్డుకుపోవడమే తప్ప వేరే మార్గం లేదు మరి.