Begin typing your search above and press return to search.

మహేష్ అక్క.. బాలయ్యకు జోడీగా!

By:  Tupaki Desk   |   21 Feb 2018 1:23 PM IST
మహేష్ అక్క.. బాలయ్యకు జోడీగా!
X
మహేష్ బాబు అక్కేంటి.. బాలయ్యకు జోడీగా నటించడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇది ఇప్పటి మాట కాదులెండి. దీని గురించి తెలియాలంటే రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి. కృష్ణ కూతురు.. మహేష్ సోదరి మంజుల కథానాయికగా మారాలని ఆశ పడి.. చివరికి ఆ కోరిక నెరవేర్చుకోలేక పోయిన సంగతి తెలిసిందే. దీని గురించి గతంలో చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసింది మంజుల. ఐతే ఇప్పుడు తన దర్శకత్వంలో రూపొందిన ‘మనసుకు నచ్చింది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పటి అనుభవాల్ని మరోసారి గుర్తు చేసుకుందామె.

కృష్ణతో ‘నంబర్ వన్’ సినిమా తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి.. నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన ‘టాప్ హీరో’కు మంజులనే కథానాయికగా అనుకున్నారట. మంజుల కూడా ఉత్సాహంగా తెరంగేట్రం చేయడానికి సిద్ధమైందట. ఐతే ముఖానికి నల్ల ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు.. పెట్రోల్ క్యాన్లు పట్టుకుని పద్మాలయ స్టూడియోకు వచ్చారట. వాళ్లు కృష్ణ ముందు నిలబడి ‘మంజుల నటిస్తే తగలబెట్టుకుని చచ్చిపోతాం’ అని గొడవ చేశారట. మంజుల సినిమాల్లో నటించదని కృష్ణ ప్రకటన చేసేవరకు వాళ్లు ఒప్పుకోలేదట. ముందు వాళ్ల మీద తనకు కోపం వచ్చినప్పటికీ.. వాళ్లు తనను ఓ చెల్లెలిలాగా.. ఇంటి ఆడపడుచు లాగా ఆవించి తాను నటించడానికి ఒప్పుకోలేదని.. కాబట్టే తాను తన కోరికను అణుచుకున్నానని మంజుల తెలిపింది.