Begin typing your search above and press return to search.

పవన్ నిజ జీవిత కథే సినిమా అట

By:  Tupaki Desk   |   12 Feb 2018 8:49 AM GMT
పవన్ నిజ జీవిత కథే సినిమా అట
X
‘‘పవన్ కళ్యాణ్ కోసం నా దగ్గరో కథ రెడీగా ఉంది.. ఆయన ఓకే అంటే సినిమా చేసేస్తా. నా కథ వింటే రాజకీయాల్ని కొంచెం పక్కన పెట్టి నా సినిమాలో నటిస్తాడు’’ అంటూ ప్రకటించి ఆశ్చర్యపరిచింది కృష్ణ కూతురు మంజుల. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్న మంజుల.. తన సినిమా గురించి.. దర్శకురాలిగా తన ప్రతిభ గురించి బాగానే గొప్పలు పోతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తాను మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అవుతానని.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. నచ్చని వాళ్లు వేస్ట్ ఫెలోస్ అని ఆమె చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. అంతే కాక ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం తాను కథ రెడీ చేశానని.. తన కథ వింటే కచ్చితంగా తనతో సినిమా చేస్తాడని కూడా మంజుల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘మనసుకు నచ్చింది’ ప్రమోషన్ల కోసం వచ్చిన మంజులను ఇంతకీ పవన్ కోసం తయారు చేసిన కథేంటో చెప్పమని అడిగారు విలేకరులు. ఇందుకామె బదులిస్తూ.. పవన్ నిజ జీవితాన్ని పోలిన కథ అని చెప్పింది. ఒక టాప్ హీరో అన్నింటినీ వదిలేసి జనాలకు సేవ చేద్దాం అని రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడు అనే అంశం మీద ఈ కథ సాగుతుందని ఆమె చెప్పడం విశేషం. మరి తన కథలోనే తాను నటించడానికి పవన్ ఏమాత్రం ఎగ్జైట్ అవుతాడో.. అంతకుమించి సినిమాలో ఏం మలుపులుంటాయో మంజులకే తెలియాలి. పవన్ తోనే కాక తన తమ్ముడు మహేష్ తో కూడా సినిమా చేయాలనుందని.. ఐతే మహేష్ తో సినిమా చేయడం ఒక కల అని.. తన ప్రతిభ చూసి అతనే పిలిచి సినిమా చేద్దాం అంటే చేస్తానని మంజుల చెప్పడం విశేషం.