Begin typing your search above and press return to search.

మ‌న్మోహ‌న్ సినిమాపై సేన క‌ల‌క‌లం... కోర్టులో పిటిష‌న్‌

By:  Tupaki Desk   |   6 Jan 2019 3:44 AM GMT
మ‌న్మోహ‌న్ సినిమాపై సేన క‌ల‌క‌లం... కోర్టులో పిటిష‌న్‌
X
మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత చిత్రమైన `ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించారంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆయన యాక్సిడెంటల్ పీఎం కాదు.. సక్సెస్ ఫుల్ పీఎం అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పదేళ్ల పాటు దేశాన్ని నడిపించిన ప్రధానిగా మన్మోహన్ ను ప్రజలు గౌరవిస్తారన్నారు. పీవీ నరసింహారావు తర్వాత దేశానికి దొరికిన విజయవంతమైన ప్రధాని మన్మోహనేనని సంజయ్ ప్రశంసించారు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా జనవరి 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత రాజకీయ దుమారం రేగుతోంది. మన్మోహన్ సింగ్ ను కించపరిచేందుకు తీసిన బీజేపీ ప్రేరేపిత సినిమా అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ సమయంలో బీజేపీ మాజీ మిత్ర పక్షం శివసేన.. మన్మోహన్ పాలన పై పాజిటివ్ గా రియాక్ట్ కావడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చజరుగుతోంది.

ఇదిలాఉండ‌గా, తాజాగా ఆ సినిమా ట్రైలర్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. చిత్రంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వాస్తవాలను వక్రీకరించి చిత్రాన్ని రూపొందించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్‌ తో పాటు చిత్ర దర్శక, నిర్మాతలపై బిహార్ న్యాయస్థానంలో సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది రెండు రోజుల క్రితం పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల కాగానే వివాదం మొదలైంది.