Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మరకతమణి

By:  Tupaki Desk   |   17 Jun 2017 6:30 AM GMT
మూవీ రివ్యూ : మరకతమణి
X
చిత్రం : ‘మరకతమణి’

నటీనటులు: ఆది పినిశెట్టి - నిక్కీ గర్లాని - మునీష్ కాంత్ రామ్ దాస్ - డానియల్ - బ్రహ్మానందం - ఆనంద్ రాజ్ - ఎం.ఎస్.భాస్కర్ తదితరులు
సంగీతం: ధిబు నినన్ థామస్
ఛాయాగ్రహణం: పి.విశేఖర్
నిర్మాణం: శ్రీ చక్ర ఇన్నోవేషన్స్-రుషి మీడియా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఏఆర్కే శరవణన్

హీరోగా తెలుగులో నిలదొక్కుకోలేకపోయినప్పటికీ తమిళంలో మంచి గుర్తింపే సంపాదించాడు తెలుగు కుర్రాడు ఆది పినిశెట్టి. వైశాలి.. మలుపు లాంటి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఇప్పుడతను ‘మరకతమణి’తో పలకరించాడు. కొత్త దర్శకుడు ఏఆర్కే శరవణనన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

కథ:

అత్యంత విలువైన మరకతమణి కోసం వెళ్లి దాన్ని ముట్టుకున్న వాళ్లందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్లు తెలిసి.. తర్వాత ఎవరూ దాని జోలికి వెళ్లడానికి భయపడుతున్న సమయంలో ఒక చైనీయుడు అది తెచ్చిస్తే రూ.10 కోట్లు ఇస్తానని ఆశ చూపిస్తాడు. కానీ ఎవ్వరూ ముందుకు రారు. ఐతే చిన్న చిన్న స్మగ్లింగ్ డీల్స్ అవీ చేస్తూ.. అప్పుల వాళ్ల బాధలు తప్పించుకోవడానికి ఏదైనా పెద్ద డీల్ చేయాలని చూస్తున్న రఘు (ఆది) తన ఫ్రెండుతో కలిసి మరకతమణిని తేవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడి నుంచే అతడికి ఇబ్బందులు మొదలవుతాయి. అతను దయ్యాలతో సహవాసం చెయ్యాల్సి వస్తుంది. వాటి సాయంతోనే మరకతమణిని తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి అతను మరకతమణిని తెచ్చాడా.. దయ్యాలు అతడికి ఏ విధంగా సాయపడ్డాయి.. ఇంతకీ ఆ మరకతమణి గుట్టేంటి.. అన్నది తెర మీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

మరకతమణి.. ఏ తరహా సినిమా అంటే చెప్పడం కష్టం. ఒక విలువైన మణి కోసం సాగే వేట నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ముందుగా దీన్ని అడ్వంచరస్ మూవీగా భావించాలి. వినోదమే ప్రధానంగా సాగుతుంది కాబట్టి ఇది కామెడీ మూవీ కూడా. దయ్యాలు.. ఆత్మలు అంటూ హార్రర్ టచ్ కూడా ఇచ్చారు. దీంతో పాటే ఫ్యాంటసీకి కూడా ఢోకా లేదు. ఇందులో సస్పెన్స్.. థ్రిల్ కూడా ఉన్నాయి. మధ్య మధ్యలో రొమాన్స్ కూడా ట్రై చేశారు. ఇలా అనేకానేక జానర్లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు కొత్త దర్శకుడు శరవణన్. కానీ ఏ జానరూ సరిగా పండక ఇదో కలగాపులగం వంటకంలా తయారైంది. అక్కడక్కడా కొన్ని నవ్వులు మినహాయిస్తే ‘మరమతమణి’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు.

ఏ కథలోకైనా ఆత్మలు ప్రవేశించాయంటే ఇక లాజిక్ అనే మాట గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఐతే శరవణన్ ఈ విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయాడు. అతడి క్రియేటివిటీ పీక్స్ కు వెళ్లిపోయింది. ఒక ఆత్మ అప్పుడే మరణించిన శవంలోకి వెళ్లడం.. లేచి మామూలు మనిషిలా తిరగడం.. ఇంకొన్ని తాజా శవాల్లోకి వేరే ఆత్మల్ని పంపడం.. హీరోతో కలిసి మణి వేటకు వెళ్లడం.. ఇలా ఫాంటసీ మామూలుగా ఉండదు. ఎంత లాజిక్ సంగతి వదిలేసినా మరీ ఈ స్థాయి క్రియేటివిటీని తట్టుకోవడం కష్టమే. దీనికి సంబంధించిన వ్యవహారంలో కొన్ని చోట్ల కొంత కామెడీ వర్కవుటైనప్పటికీ.. చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. చాలా చోట్ల ఏంటో ఈ ఆత్మల గోల అనిపిస్తుంది.

మణి కోసం వేట అనగానే చాలా థ్రిల్స్.. సస్పెన్స్ ఆశిస్తాం కానీ.. దర్శకుడు వాటి కంటే కూడా ప్రధానంగా కామెడీ మీదే దృష్టిపెట్టాడు. కథను సరదాగా నడిపించాలని ప్రయత్నించాడు. ఐతే అక్కడక్కడా నవ్వుకున్నప్పటికీ కథలో ఇన్వాల్వ్ కావడం కష్టం. ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం కథ వెళ్లిపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది. మణి కోసం వేట అనగానే ఎక్కడికో ప్రయాణం.. ఎన్నో ప్రయాసలు.. ఎన్నో మలుపులు ఊహించుకుంటాం కానీ.. ఇందులో అలాంటివేం ఉండవు. హీరో విరామ సమయానికి కూడా సన్నాహాల్లోనే ఉంటాడు. ద్వితీయార్ధంలో కూడా ఇలాగే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. చివరికి మణికి సంబంధించి ఏదో పెద్ద సస్పెన్స్ ఉంటుందనుకుంటే అదీ లేదాయె. ఎప్పుడో 70లు.. 80ల్లో మాదిరి రొటీన్ గానే సినిమాకు ముగింపు ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది.

తమిళం నుంచి తెలుగులోకి వచ్చే కొన్ని డబ్బింగ్ సినిమాలకు నేటివిటీ ఫ్యాక్టర్ అనేది చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ‘మరకతమణి’ ఈ కోవలోని సినిమానే. ఇలాంటి సినిమాల్ని కనీసం డబ్బింగ్ తో అయినా కొంతమేర కవర్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ అదే జరగలేదు. ఇందులోని ప్రధాన పాత్రధారులు చాలామంది మనకు పరిచయం లేని తమిళులు. వాళ్ల అవతారాలు కూడా తమిళ నేటివిటీకి తగ్గట్లుంటాయి. సినిమా అంతటా కూడా తమిళ వాతావరణం కనిపిస్తుంటుంది. కామెడీలోనూ తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి తోడు డబ్బింగ్ కూడా ఏదో మొక్కుబడిగా.. అతకనట్లుగా చేశారు. దీంతో మన ప్రేక్షకులు ‘మరకతమణి’తో కనెక్టవడం మరింత కష్టమవుతుంది. తమిళ జనాలు ఈ సినిమాతో కనెక్టయ్యే అవకాశముందేమో కానీ.. తెలుగోళ్లకు మాత్రం కష్టమే.

నటీనటులు:

ఇందులో ఆది పినిశెట్టి హీరోలా కనిపించడు. పాత్రధారుల్లో ఒకడిగా కనిపిస్తాడంతే. స్క్రీన్ టైం ఎక్కువుందన్న మాటే కానీ.. రెగ్యులర్ హీరో వేషాలేమీ కనిపించవు. పాత్రకు తగ్గట్లుగా చక్కగా నటించాడతను. హీరోయిన్ నిక్కీ గర్లానికి డిఫరెంట్ రోల్ దక్కింది. హీరోయిన్ కు ఇలాంటి పాత్రను ఊహించం. ఈ క్యారెక్టర్ని కొందరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. హీరో హీరోయిన్ల తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది మునీష్ కాంత్ రాందాస్ గురించే. అచ్చమైన తమిళవాడిలా ఉండటం వల్ల తెలుగు వాళ్లు అతడితో కనెక్ట్ కావడం కొంచెం ఇబ్బంది కావచ్చు. ఐతే అతను తన వంతుగా బాగా ఎంటర్టైన్ చేశాడు. ఒకప్పటి విలన్ ఆనంద్ రాజ్ ఇందులో ఫన్నీ క్యారెక్టర్ చేశాడు. అది ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం చివర్లో వచ్చి కొంచెం వినోదం పంచాడు. మిగతా పాత్రధారులందరూ కూడా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

‘మరకతమణి’కి టెక్నికల్ టీం బాగానే సపోర్ట్ ఇచ్చింది. ధిబు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు తగ్గట్లుగా బాగా కుదిరింది. సినిమాలాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. పి.వి.శేఖర్ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఇప్పుడున్న ప్రమాణాలతో చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు. డబ్బింగ్ విషయంలో శ్రద్ధ పెట్టాల్సింది. చాలా హడావుడిగా కానిచ్చేసినట్లున్నారు. చాలా వరకు వాయిస్ లు అతకనట్లుగా అనిపిస్తాయి. దర్శకుడు శరవణన్ తొలి సినిమాతో రిస్కే చేశాడు. హాలీవుడ్ సినిమాల తరహాలో రకరకాల జానర్లు మిక్స్ చేసి.. ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ తీసే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ కనిపించినా.. ఓవరాల్ గా అతను మెప్పించలేకపోయాడు. రాతలో కానీ.. తీతలో కానీ.. అతను లాజిక్ అనే విషయాన్ని పట్టించుకోలేదు.

చివరగా: ఈ ‘మణి’లో మెరుపులేం లేవు

రేటింగ్- 2.25/5​


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre