Begin typing your search above and press return to search.

మార్చి 5 vs మార్చి 11: ఢీ అంటే ఢీ

By:  Tupaki Desk   |   3 March 2021 8:30 AM GMT
మార్చి 5 vs మార్చి 11: ఢీ అంటే ఢీ
X
టాలీవుడ్ లో సినిమాల సందడి షురూ అయింది. మార్చి 5వ తేదీన 5 సినిమాలు రిలీజ్ అవుతుంటే.. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న 4 సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే మార్చి 5న విడుద‌ల‌య్యే సినిమాల కంటే మార్చి 11న వచ్చే సినిమాల మీద‌నే అంద‌రి ఫోక‌స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శివ‌రాత్రి అవ్వ‌డం.. అందులోను మూడు క్రేజీ మూవీస్ ఉండటం వల్ల అంద‌రి చూపు ఆ రోజు వచ్చే వాటి మీద‌నే ఉంది.

యువ హీరో సందీప్ కిషన్ 25వ సినిమా 'ఏ1 ఎక్స్ ప్రెస్' ఈ శుక్రవారం రానుంది. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెలుగులో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలానే ఆర్కే నాయుడిగా పాపులర్ అయిన సాగర్ హీరోగా తెరకెక్కిన 'షాదీ ముబారక్' సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చే సినిమా కావడం దీనికి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ - దర్శకుడు విజయ్ కుమార్ కొండా కాంబోలో రూపొందించిన 'పవర్ ప్లే' కూడా ఈ శుక్రవారమేవిడుదల కానుంది. వీటితోపాటుగా 'క్లైమాక్స్' మరియు 'ఏ' సినిమాలు
ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

మహా శివరాత్రి సందర్భంగా వర్సటైల్ యాక్టర్ శ‌ర్వానంద్ నటించిన తాజా చిత్రం 'శ్రీకారం' మార్చి 11న విడుదల అవుతోంది. అలానే నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'జాతిరత్నాలు' చిత్రాన్ని అదే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీ విష్ణు - రాజేంద్ర ‌ప్ర‌సాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'గాలి సంపత్' సినిమా కూడా శివరాత్రికే రానుంది. అయితే 'జాతి ర‌త్నాలు' చేస్తున్న హ‌డావుడి మిగతా సినిమాలు చేయ‌లేక‌పోతున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

శర్వా కార‌ణంగా ఓపెనింగ్స్ వ‌చ్చే అవకాశం ఉంది. ఆ ధీమాతోనే 'శ్రీకారం' టీమ్ ఆడియెన్స్ ఎటెన్ష‌న్ గెయిన్ చేయ‌డానికి ప్రమోషన్స్ చేయడం లేదనే టాక్ ఉంది. మ‌రోవైపున 'జాతిర‌త్నాలు' మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రమోషన్స్ తో గోల గోల చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక 'గాలి సంపత్' పూర్తిగా అనిల్ రావిపూడి క్రేజ్ మీద డిపెండ్ అవుతోంది. క‌న్న‌డలో భారీ బడ్జెట్ సినిమాగా ప్ర‌చారం అవుతున్న 'రాబ‌ర్ట్' సినిమా వీటికి పోటీగా తెలుగులో విడుదల అవుతోంది. డబ్బింగ్ సినిమా కావడం వల్ల దీనిపై తెలుగు ప్రేక్ష‌కుల ఎటెన్ష‌న్ పెద్ద‌గా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు వారాల గ్యాప్ లో పోటీ పడుతున్న ఈ చిత్రాల్లో ఏవి సక్సెస్ అవుతాయో చూడాలి.