Begin typing your search above and press return to search.

భలే భలే సంపాదనోయ్ మారుతీ..

By:  Tupaki Desk   |   10 Sep 2015 1:34 PM GMT
భలే భలే సంపాదనోయ్ మారుతీ..
X
డైరెక్టర్ మారుతిది మంచి బిజినెస్ బుర్ర అన్న విషయం అతడి కెరీర్ చూస్తే అర్థమవుతుంది. తొలి సినిమా ‘ఈ రోజుల్లో..’తోనే తనకంటూ ఓ బ్రాండ్ నేమ్ సంపాదించుకున్న మారుతి.. రెండో సినిమా ‘బస్ స్టాప్’ నుంచే సినిమాలో వాటాలు తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ప్రేమకథా చిత్రమ్ సినిమాకు కూడా వాటా రూపంలో భారీగానే ముట్టింది. ఆ తర్వాత తన సమర్పణలో వరుసగా సినిమాలు వదిలాడు. అందులో మారుతి పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ సినిమాలకు. అతడి బ్రాండ్ నేమ్ వాడుకున్నందుకు పేమెంట్ అన్నమాట. ఐతే వరుసగా చెత్త సినిమాలు రావడంతో అతడి గుడ్ విల్ అంతా పోయింది. పైగా తన దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త జంట’ ఆశించిన విజయం సాధించకపోవడంతో మారుతి హవా బాగా తగ్గింది.

ఐతే ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ సినిమా భారీ విజయాన్నందుకోవడంతో మళ్లీ మారుతి బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తో పాటు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుని భారీ మొత్తం జేబులో వేసుకుంటున్నాడు మారుతి. ఈ విజయం తర్వాత అతడి రేంజే మారిపోతోంది. చాలా మంది పెద్ద హీరోలు అతడితో సినిమాకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఐతే మారుతితో ఇప్పుడు ఎవరు సినిమాలు చేయాలన్నా.. రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాల్సిందే అని కండిషన్ పెడుతున్నాడట.

లాభాల్లో వాటా అన్నాడంటే.. సినిమా హిట్ అయితేనే కాబట్టి నిర్మాతలకు కూడా పెద్ద ఇబ్బంది అయ్యే అవకాశమేమీ లేదు. మారుతి తర్వాతి సినిమా దిల్ రాజుతో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ బేనర్ లో ఇప్పటికే ఓ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ఇస్తున్నాడు మారుతి. ఆ సినిమాకు కూడా వాటానే తీసుకోబోతున్నాడట. ఆ తర్వాత అతడి దర్శకత్వంలోనే దిల్ రాజు ఓ సినిమా నిర్మించే అవకాశాలున్నాయి. రాజుకైనా, ఇంకెవరికైనా కూడా రెమ్యూనరేషన్ ప్లస్ లాభాల్లో 30 శాతం వాటా సూత్రాన్నే అమలు చేయాలని భావిస్తున్నాడట మారుతి. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే... భలే భలే సంపాదనోయ్ మారుతి అనాల్సి వస్తోంది.