Begin typing your search above and press return to search.

మారుతి సినిమాలకి 500% రిట‌ర్న్స్‌

By:  Tupaki Desk   |   12 Sep 2015 5:30 PM GMT
మారుతి సినిమాలకి 500% రిట‌ర్న్స్‌
X
ఎక్క‌డైనా స‌రే.. పెట్టిన పెట్టుబ‌డికి అద‌నంగా ఓ యాభై శాతం లాభాలొస్తే చాల‌నుకొంటాం. కొన్ని కొన్నిసార్లు పెట్టిన డ‌బ్బు తిరిగొచ్చినా చాల‌నుకొనే ప‌రిస్థితి. కానీ మ‌నం పెట్టిన‌దానికి ఏకంగా 500%శాతం లాభాలొస్తే ఎలా ఉంటుంది? అస‌లు ఇలాంటి లాభాల్ని మ‌నం ఊహించ‌గ‌ల‌మా? కానీ మారుతి సినిమాలు నిజంగానే అంతటి లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి. మ‌న ద‌గ్గ‌ర మాటేమో కానీ... ఓవ‌ర్సీస్‌లో మాత్రం మారుతి సినిమాల‌కి న‌మ్మ‌శక్యం కాని రీతిలో లాభాలొస్తున్నాయి. `కొత్త‌జంట‌` మిన‌హా అమెరికాలో విడుద‌లైన మారుతి సినిమాల‌న్నీ అక్క‌డ 500% శాతం లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ల పాలిట మారుతి మోస్ట్ బిలీవ‌బుల్ డైరెక్ట‌ర్‌ గా మారాడు. ఇక నుంచి ఆయ‌న సినిమాలు ఓవ‌ర్సీస్‌ లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయ‌న‌డంలో ఎంత‌మాత్రం ఆశ్చ‌ర్యం లేదు.

మారుతి తీసిన తొలి చిత్రం `ఈరోజుల్లో` అప్ప‌ట్లో అమెరికాలో 2 ల‌క్ష‌ల‌కు అమ్మారు. ఆ చిత్రానికి ఏకంగా 25ల‌క్ష‌లొచ్చింద‌ట‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ని ఓవ‌ర్సీస్‌ లో 5 ల‌క్ష‌ల‌కు కొని విడుద‌ల చేశారు. ఆ చిత్రం డిస్ట్రిబ్యూట‌ర్ ల‌కు ఏకంగా 75 ల‌క్ష‌లు తెచ్చిపెట్టింద‌ట‌. ఇటీవ‌ల విడుద‌లైన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` 55 ల‌క్ష‌ల‌కు అమ్ముడు కాగా ఏకంగా 1 మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌ ని అధిగ‌మించింది. 1 మిలియ‌న్ డాల‌ర్లు అంటే మ‌న ఇండియా క‌రెన్సీలో సుమారు ఆరున్న‌ర కోట్లన్న‌మాట‌. ఆ లెక్క‌న ఎంత లాభ‌మే ఊహించొచ్చు. త‌మ త‌మ సినిమాల‌తో 1 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ సాధించిన దర్శ‌కులు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉండొచ్చు కానీ మారుతి అంత లాభాల్ని తెచ్చిపెట్టిన ద‌ర్శ‌కులు మాత్రం మ‌రెవ్వ‌రూ లేరు. అక్క‌డ‌న్నీ పెద్ద సినిమాలే మిలియ‌న్ మార్కుని చేరుకొన్నాయి. కానీ ఓ మిడిల్ బ‌డ్జెట్ సినిమాతో ఆ మార్క్‌ని అధిగ‌మించడం ఒక్క మారుతికే సాధ్య‌మైంది.