Begin typing your search above and press return to search.

మారుతి దీన్నుంచి బయటికి రావాలి..

By:  Tupaki Desk   |   1 Oct 2017 12:30 AM GMT
మారుతి దీన్నుంచి బయటికి రావాలి..
X
తొలిసారి చూసినపుడు కొత్తగా అనిపించే ఒక విషయం.. రెండోసారికి ఓకే అనిపిస్తుంది. మూడోసారికి మామూలైపోతుంది. ఆ తర్వాత మాత్రం మొహం మొత్తేస్తుంది. ఐతే జనాలకు ఏ దశలో మొహం మొత్తుతోందో గుర్తించి.. మార్పు వైపు అడుగులేయడం కీలకం. యువ దర్శకుడు మారుతి ఈ విషయాన్ని గుర్తించాలిప్పుడు. ‘ఈరోజుల్లో’ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడతను. ఆ తర్వాత ఆ ఫార్మాట్లో చాలా సినిమాలొచ్చాయి. ఐతే అదే స్టయిల్లో కొంచెం బూతు డోస్ పెంచి ‘బస్ స్టాప్’ తీయడమే కాక తన ప్రొడక్షన్లో కూడా ఆ టైపు సినిమాలు చేశాడు మారుతి. ఐతే ఈ ఫార్ములా తేడా కొట్టడం మొదలయ్యాక బయటికి వచ్చాడు. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో ఒక తరహా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడతను.

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మారుతి కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టాడు. హీరోకు ఏదో ఒక బలహీనత ఆపాదించడం.. దాని చుట్టూ క్యారెక్టర్ అల్లడం.. వినోదం పండించే ప్రయత్నం చేయడం మారుతి స్టైల్ గా మారింది. ‘భలే భలే..’ సూపర్ హిట్టవడంతో ఆ తర్వాత ‘బాబు బంగారం’లో జాలి కాన్సెప్ట్ పెట్టాడు. కానీ అది తేడా కొట్టేసింది. ఇప్పుడు అచ్చంగా ‘భలే భలే..’ ఫార్మాట్లోనే ‘మహానుభావుడు’ను నడిపించాడు. ఇందులో ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. పండగ సీజన్లో వచ్చిన రెండు పెద్ద సినిమాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం కూడా దీనికి కలిసొస్తోంది. ఐతే ఈ సినిమా చూసిన వాళ్లందరూ ఇది ‘భలే భలే..’ ఫార్మాట్లోనే ఉండటంపై పెదవి విరుస్తున్నారు. ఈసారికి ఓకే కానీ.. మారుతి ఇంకోసారి ఇదే స్టయిల్లో సినిమా తీస్తే మాత్రం జనాలకు మొహం మొత్తడం ఖాయమని.. బోల్తా కొట్టక తప్పదని.. కాబట్టి అతను స్టయిల్ మార్చాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు. మారుతి ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.