Begin typing your search above and press return to search.

భలే భలే-2 అంటున్న మారుతి

By:  Tupaki Desk   |   5 Sept 2016 5:00 PM IST
భలే భలే-2 అంటున్న మారుతి
X
నాని కెరీర్లో.. అలాగే మారుతి కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా ‘భలే భలే మగాడివోయ్’. చిన్న సినిమాగా మొదలై.. చాలా పెద్ద రేంజికి వెళ్లిన చిత్రమిది. రూ.50 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి.. గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీసే అవకాశాలున్నాయని అంటున్నాడు మారుతి. ‘మజ్ను’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ ఈ విషయమై హింట్ ఇచ్చాడు మారుతి. నాని గురించి మారుతి ఏమన్నాడంటే..

‘‘నాని తెర మీద ఒకలా కనిపిస్తాడు. నిజ జీవితంలో ఇంకోలా ఉంటాడు. పాజిటివ్ సెన్స్ లో ఈ మాట చెబుతున్నా. నేను రెండేళ్ల కిందట నానికి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పడానికి వెళ్లాను. నిజానికి ఆ టైంలో నాని గారి కెరీర్ ఏమంత బాగా లేదు. ఆయన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొంచెం డౌన్లో ఉన్నారు. ఐతే కథ చెప్పి బయటికి వచ్చాక చాలా నవ్వుతూ సరదాగా మాట్లాడారు నాని. సక్సెస్.. ఫెయిల్యూర్ అనేది ఒక సైకిల్ అని.. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ రాకపోదని.. ఫెయిల్యూర్స్ అయిపోయాయి కాబట్టి ఇకపై తనకన్నీ విజయాలే రాబోతున్నాయన్న సంతోషంలో నవ్వుతున్నట్లు చెప్పారు. ఫెయిల్యూర్లలో ఉన్నపుడు అంత పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తులు తక్కువమంది ఉంటారు. అంత గొప్ప ఫిలాసఫర్ నాని. అతను నాకు ‘భలే భలే భలే మగాడివోయ్’ లాంటి గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. అది నా జీవితంలో మరిచిపోలేని సినిమా. ఆ సినిమా విడుదలై ఏడాది అయింది. ఆ సందర్భంగా నాని గారికి ఫోన్ చేసి.. ‘భలే భలే మగాడివోయ్-2’ చేద్దాం అన్నాను. ఆయన సరేనన్నారు’’ అని మారుతి చెప్పాడు.