Begin typing your search above and press return to search.

'మంచిరోజులు వచ్చాయి' .. మనసుకు పడే వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   30 Oct 2021 3:46 AM GMT
మంచిరోజులు వచ్చాయి .. మనసుకు పడే వ్యాక్సిన్
X
చాలా చిన్న సినిమాలతో .. చిన్న హీరోలతో దర్శకుడిగా మారుతి ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఆయన పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ చిన్న సినిమాలను మరిచిపోలేదు. ఇక తన సినిమా టైటిల్స్ లో 'రోజులు' అనేవి రావడం ఆయన సెంటిమెంట్ గా మారిపోయింది. 'ఈ రోజుల్లో .. ' రోజులు మారాయి' .. 'ప్రతిరోజూ పండగే' .. ఇప్పుడు 'మంచిరోజులు వచ్చాయి'. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా, వచ్చేనెల 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడాడు.

"నాకు చాలా హ్యాపీగా ఉంది .. 'ప్రతిరోజూ పండగే' తరువాత ఒక మంచి సినిమా .. పెద్ద సినిమా చేయాలని చెప్పి, 'పక్కా కమర్షియల్' కథ రాసుకోవడం జరిగింది. దానిని యూవీ అండ్ గీతా బ్యానర్లో తీయడం మొదలుపెట్టాను. 40 శాతం చిత్రీకరణ అయిన తరువాత మళ్లీ కరోనా .. మళ్లీ లాక్ డౌన్ అన్నారు. కరోనా మనలను ఆపకూడదు అనుకుని, ఎప్పటి నుంచో బ్రెయిన్లో నలుగుతున్న ఒక లైన్ ను కథగా రాసుకుని, ఒక 30 రోజ్జుల్లో తీయాలనుకున్నాను. అదే విషయాన్ని మా నిర్మాత వంశీకి చెప్పాను. ఆయన ఓకే చెప్పడంతో ఈ సినిమా స్టార్ట్ అయింది.

'ప్రేమకథా చిత్రం'లా చిన్న సినిమా చేద్దామని అనుకున్నాను. కష్టమైనా .. నష్టమైనా .. ఆడినా .. ఆడకపోయినా మనకే పేరు రావాలనే ఉద్దేశంతో నేనే పేరు వేసుకుని చేస్తున్నాను. నిజానికి 30 .. 35 కోట్లతో ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు, ఇంకో చిన్న సినిమా చేయాలంటే నిర్మాతలకి ధైర్యం ఉండదు. సినిమా అంతా పూర్తయిన తరువాత నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్లి 'నేను ఒక చిన్న సినిమాను తీశాను' అని చెప్పాను. ఆయన షాక్ అయ్యారు. 'ఎప్పుడురా' అన్నట్టుగా నా వైపు ఒక లుక్ ఇచ్చారు. లేదు అంకుల్ మీరు పేరు వేసుకోమంటే వేసుకుంటాను .. లేదంటే లేదు అన్నాను.

నేను ఎప్పుడు ఏ పని చేసినా ఇండస్ట్రీలో నాకు ఉన్న గాడ్ ఫాదర్స్ అల్లు అరవింద్ గారు .. చిరంజీవి గారు. నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడనే విషయాన్ని ముందుగా గుర్తు చేసింది చిరంజీవి గారు. పరిస్థితులకు అనుగుణంగా నేను వెళుతున్నప్పుడు ఈ బ్యానర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాయి. అందువలన నేను ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాను. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా కూడా నిలబెడుతుందనే అనుకుంటున్నాను.

ఈ సినిమా తీయాలనుకోవడానికి ఒక కారణం ఉంది. కరోనా వలన అంతా భయపడుతున్నారు. కరోనా రాకపోయినా వచ్చేసిందని ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు. ఇది వరకూ మిడిల్ క్లాస్ .. లోయర్ మిడిల్ క్లాస్ వారు చాలా ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్లంతా కూడా మాస్కులు పెట్టేసుకుని .. శానిటైజర్లు రాసేసుకుని తెలియని ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఈ భయం మీద సరదాగా ఒక సినిమా ఎందుకు చేయకూడదు అనిపించింది.

ముందుగా ఫాదర్ కేరక్టర్ కోసం అజయ్ ఘోష్ ను చూసుకున్నాను. అజయ్ ఘోష్ ను చూడగానే నాటుగా ఉంటాడు .. భయపెడతాడు. ఆయన ఆహార్యమే కొంచెం తేడాగా అనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది. అలా భయపెట్టే వ్యక్తి భయపడుతూ ఉంటే .. పిల్లలు క్లాప్స్ కొడుతూ ఉంటారు .. నాలాంటివాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చిన్న బడ్జెట్ లో పనై పోతుందని చెప్పేసి ఆయనను తీసుకున్నాను. నేను ఒక చిన్న సినిమాను చేసుకుంటున్నాను .. గ్యాపు దొరికిందని సరదాగా చేస్తున్నాను .. ప్రొఫెషనల్ గా .. సీరియస్ గా తీసుకోవద్దని మిగతా ఆర్టిస్టులకు కూడా చెప్పాను.

'మంచి రోజులు' సినిమాలో ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. భయం అనే ఒక ఎమోషన్ .. ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఆ భయం అలా పెరిగిపోతే వాళ్లపై వాళ్లకి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. అలాంటివారిపై ఈ సినిమా ఒక మందులా పనిచేయాలని చెప్పి ఈ సినిమా చేశాను. గవర్నమెంట్ వాళ్లు వ్యాక్సిన్ ను బాడీకి ఇస్తే .. మేము మనసుకు వేస్తున్నాము. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడా డిజప్పాయింట్ చేయదు . చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. మెహ్రీన్ వంటి ఒక పెద్ద హీరోయిన్ నాకు కాల్ చేసి మరీ ఈ సినిమా చేసింది. ఎందుకంటే కేవలం నా మీద ఉన్న నమ్మకంతో.

ఈ సినిమా ఇలా రావడానికి కారణం నా టీమ్. ఈ సినిమాను ముందుగా ఓటీటీ కోసం అనుకున్నప్పటికీ ఆ తరువాత థియేటర్ కి వస్తున్నాం. అందుకు కారణం ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్" అని చెప్పుకొచ్చారు.