Begin typing your search above and press return to search.

మాస్ మహారాజ్ ఇప్పుడిక టైమ్ తీసుకోవలసిందే!

By:  Tupaki Desk   |   2 Aug 2022 11:30 PM GMT
మాస్ మహారాజ్ ఇప్పుడిక టైమ్ తీసుకోవలసిందే!
X
రవితేజ తెరపై చాలా యాక్టివ్ గా ఉంటాడు .. కథను పరిగెత్తిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. ఒక ఆకతాయిలా హీరోయిన్ ను ఆటపట్టించే తీరును అభిమానులు ఎక్కువగా లైక్ చేస్తారు. పాత్ర ఏదైనా ఓన్ చేసుకుని తనదైన స్టైల్లో దానిని ఆవిష్కరిస్తాడు. పట్టి పట్టి బట్టీపట్టినట్టుగా కాకుండా చాలా సరదాగా ఆ పాత్రను ప్రేక్షకుల మధ్య కి తీసుకుని వెళతాడు. రవితేజకి గల ఈ ప్రత్యేకత కారణంగానే ఆయన ఇంతకాలం పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడని చెప్పవలసిన పనిలేదు.

అలాంటి రవితేజ ఆ మధ్య వరుస పరాజయలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆయన పారితోషికం తగ్గించుకోవలసిందే అని నిర్మాతలు పట్టుబట్టేవరకూ పరిస్థితి వచ్చింది. అయినా రవితేజ తగ్గలేదనుకోండి .. అది వేరే విషయం. ఆ తరువాత 'రాజా ది గ్రేట్' ఆయనకి కాస్త ఉపశమనాన్ని కలిగించింది. 'క్రాక్' సినిమా 'హమ్మయ్య' అనిపించింది. ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి, కంటెంట్ ఉంటే రవితేజ సినిమాలు థియేటర్లను ఎలా దడదడలాడిస్తూ ఉంటాయనేది నిరూపించింది. ఆయన ఫాలోయింగ్ ఎంతమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.

ఇక 'క్రాక్' సినిమా తరువాత రవితేజ తన పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకుని వస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'ఖిలాడి' .. రీసెంట్ గా వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు దెబ్బతిన్నాయి. టైటిల్స్ చూస్తే రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే అనిపిస్తున్నాయి.

థియేటర్ కి వెళితే సీన్ మారిపోతోంది. ఏదో అవుతుందనుకుంటే .. తెరపై మరేదో జరిగిపోతోంది. 'రామారావు ఆన్ డ్యూటీ' కథను సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశానని రవితేజ చెప్పాడు. డైరెక్టర్ కి గల కాన్ఫిడెంట్ .. కథపై ఆయనకి గల క్లారిటీ చూసే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అన్నాడు.

కానీ నిజం చెప్పాలంటే ఆ కథలో లోపించిన వాటిలో ఆ రెండింటిదే అగ్రతాంబూలం. కథ విషయంలో నాన్చడం తనకి ఇష్టం ఉండదనీ, ఏదైనా సరే వెంటనే తేల్చిపారేస్తానని రవితేజ అన్నాడు. కానీ కాస్త టైమ్ తీసుకుని ఆలోచించుకోవడానికీ .. నాన్చడానికి మధ్య తేడా ఉంది. కథ వినగానే ఓకే చెప్పేస్తే .. ఇదిగో ఇలాగే ఉంటుంది.

ఇకపై కూడా అభిమానులను ఈ రేంజ్ లో నిరాశపరచకుండా ఉండాలంటే మున్ముందు ఆయన కొంత సమయం తీసుకోవలసిందే .. కథపై కసరత్తు జరిగేలా చూసుకోవలసిందే. చేతిలో ఉన్న 'ధమాకా' .. 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టులపై కూడా ఆయన కాసింత దృష్టి పెట్టాల్సిందే.