Begin typing your search above and press return to search.

అమెజాన్ లో ద‌ళ‌పతి విజయ్ `మాస్టర్`

By:  Tupaki Desk   |   27 April 2020 5:30 AM GMT
అమెజాన్ లో ద‌ళ‌పతి విజయ్ `మాస్టర్`
X
క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో అన్ని ప‌రిశ్ర‌మ‌లు అయోమ‌యంలో ఉన్నాయి. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌లు ఆగమ్య‌గోచ‌రంలో కొట్టుమిట్టాడే పరిస్థితి. తిరిగి షూటింగులు ప్రారంభ‌మ‌య్యేదెపుడు? చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌యిన వాటిని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేదెపుడు? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే సినీప‌రిశ్ర‌మ‌పైనే క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే థియేట్రిక‌ల్ రిలీజ్ ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని గ్ర‌హించిన కొంద‌రు స్టార్ హీరోలు.. నిర్మాత‌లు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి వేదిక‌ల‌పై త‌మ సినిమాల్ని రిలీజ్ చేసేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నారు. ఇన్నాళ్లు వేచి చూశారు. కానీ ఏదీ సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి కనిపించ‌డం లేదు. ఇలాంటి వేళ డ్యామేజ్ ని అరిక‌ట్టాలంటే ఏదో ఒక రూపంలో రిలీజ్ చేసేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నారు. డిజిట‌ల్ రిలీజ్ అయితే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల్సిన ప‌నేలేదు. ఆ క్ర‌మంలోనే ఇన్నాళ్లు వెయిట్ చేసి ఫ‌లితం ఉండ‌ద‌ని భావించిన త‌మిళ అగ్ర హీరో సూర్య త‌న సినిమాల్ని డిజిట‌ల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

త‌న భార్యామ‌ణి జ్యోతిక న‌టించిన తాజా చిత్రం `పొన్మగల్ వంధల్` అమెజాన్ లో రిలీజ్ చేసేయాల‌ని సూర్య నిర్ణ‌యించుకున్నారు. అయితే దీనిని వ్య‌తిరేకిస్తూ .. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ యజమానులు ఈ విష‌యంపై చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే ఇలా చేస్తే బిగ్ స్టార్ అయినా సూర్య సినిమాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేసేందుకు అంగీక‌రించ‌మ‌ని హుకుం జారీ చేశారు. అయితే 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన‌ ఈ చిత్రాన్ని మే 1 వ వారంలో విడుదల చేయడానికి సూర్య‌ గట్టి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. ఎవ‌రి హెచ్చ‌రిక‌ల్ని ఆయ‌న ఖాత‌రు చేసే ఆలోచ‌న‌లో లేర‌ట‌.

ఇదిలా ఉండ‌గానే.. కోడంబక్కంలో మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం సాగుతోంది. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్ట‌ర్ ను కూడా అమెజాన్ లో రిలీజ్ చేసేయ‌నున్నార‌న్న‌ది దాని సారాంశం. ఈ చిత్రంలో విజ‌య్ - విజ‌య్ సేతుప‌తి లాంటి టాప్ స్టార్లు న‌టించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆండ్రియా జెరోమీయా- మాలవికా మోహనన్- శాంతను భాగ్యరాజ్ - అర్జున్ దాస్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. అయితే సూర్య‌.. విజ‌య్.. విజ‌య్ సేతుప‌తి లాంటి అగ్ర హీరోలు న‌టిస్తున్న సినిమాల్ని డిజిట‌ల్ రిలీజ్ చేసేందుకు సాహ‌సిస్తున్నారంటే .. థియేట్రిక‌ల్ రిలీజ్ పై ఇప్ప‌ట్లో న‌మ్మ‌కం లేద‌న్న క్లారిటీ వ‌చ్చేస్తోంది. ఇక తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనూ ఇంకా హీరోలు బింకం ప్ర‌ద‌ర్శిస్తున్నా .. అంద‌రూ దిగి వ‌చ్చి డిజిట‌ల్ రిలీజ్ ల‌కు అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.