Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మసూద

By:  Tupaki Desk   |   18 Nov 2022 5:04 PM GMT
మూవీ రివ్యూ : మసూద
X
'మసూద' మూవీ రివ్యూ
నటీనటులు: సంగీత-తిరువీర్-బాంధవి శ్రీధర్-కావ్య కళ్యాణ్ రామ్-సత్యప్రకాష్-శుభలేఖ సుధాకర్-సత్యం రాజేష్-సురభి ప్రభావతి తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
రచన-దర్శకత్వం: సాయికిరణ్

మళ్ళీ రావా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో నిర్మాతగా మంచి అభిరుచిని చాటుకున్నాడు రాహుల్ యాదవ్ నక్క. ఈసారి అతను సాయికిరణ్ అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం.. మసూద. సీనియర్ నటి సంగీత.. యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ హార్రర్ మూవీ ప్రేక్షకులను ఎంతమేర భయపెట్టింది.. ఉత్కంఠ పంచింది.. తెలుసుకుందాం పదండి.

కథ:

నీలమ్ (సంగీత) ఒక ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్. భర్త నుంచి విడిపోయిన తన ఏకైక కూతురు నాజియా (బాంధవి శ్రీధర్)ను చదివించుకుంటూ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపి (తిరువీర్) వీరికి చేదోడు వాదోడుగా ఉంటాడు. అయితే నాజియా ఉన్నట్లుండి ఒక రోజు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ముందు డాక్టర్ కు చూపించినా ఫలితం ఉండదు. దీంతో ఆమెను పీర్ బాబా దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడే ఆమెను మసూద అనే ఆత్మ పట్టి పీడిస్తోందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ మసూద ఎవరు.. నాజియాను ఆమె ఎందుకు ఆవహించింది.. ఈ ఆత్మ నుంచి నాజియాను బయటపడేయడానికి పీర్ బాబతో కలిసి నీలమ్.. గోపీ ఏం చేశారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తెలుగులో నిఖార్సయిన హార్రర్ సినిమాలు వచ్చి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు హార్రర్ అంటే హార్రరే కానీ.. మధ్యలో అందులోకి కామెడీ జొరబడి ఈ జానర్ ను పక్కదోవ పట్టించేసింది. కొంత కాలం హార్రర్ కామెడీలు బాగానే నడిచినా.. అవన్నీ ఒక మూస పద్ధతిలో సాగి ఆ జానర్ అటకెక్కేసింది. ఐతే ఇప్పుడు కొత్త దర్శకుడు సాయికిరణ్.. పూర్తిగా హార్రర్ జానర్ కు కట్టుబడి తీసిన సినిమా.. మసూద. రెగ్యులర్ హార్రర్ సినిమాలకు భిన్నంగా ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుని.. అతను ప్రేక్షకులకు థ్రిల్స్.. చిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ నేపథ్యమే సినిమాకు ఒక యునీక్ ఫీల్ తీసుకొచ్చింది. సినిమాలో కొన్ని మూమెంట్స్ చూసి ఒళ్లు జిల్లుమనడం ఖాయం. కాకపోతే హార్రర్ ప్రియులను ఉత్కంఠతో ఊపేయడానికి తగ్గ సెటప్ కుదిరినా.. అనుకున్నంతగా ఆ అవకాశాన్ని దర్శకుడు ఉపయోగించుకోలేదనిపిస్తుంది. నరేషన్ మరీ నెమ్మదిగా ఉండడం.. అవసరం లేని కొన్ని ట్రాక్స్ తోడై.. ప్రేక్షకుల సహనానికి కొంతమేర పరీక్ష పెడతాయి. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ.. జాన్ ప్రియులను ఆకట్టుకునే కొన్ని మూమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి.

హార్రర్ సినిమాల్లో చాలా వరకు ఒక అమ్మాయికి దయ్యం పట్టడం.. ముందు వాళ్లు ఏవేవో ప్రయత్నాలు చేసి.. చివరికి ఒక స్వామీజీ లేదా పీర్ బాబా దగ్గరికి వెళ్లడం.. ఆ వ్యక్తి దయ్యం వదలగొట్టే ప్రక్రియ చేపట్టడం.. ఈ క్రమంలో దయ్యం తాలూకు గతం వెల్లడి కావడం.. చివరగా ఏదో ఒకటి చేసి దయ్యాన్ని సాగనంపడం.. ఇదే టెంప్లేట్ ఉంటుంది. 'మసూద' కూడా ఈ ఫార్మాట్లో సాగే సినిమానే. కాకపోతే ఈ కథను నరేట్ చేసే విధానంలో కొంచెం వైవిధ్యం కనిపిస్తుంది. అంతే కాక దయ్యం ఫ్లాష్ బ్యాక్ కూడా విభిన్నంగా అనిపిస్తుంది. దయ్యాన్ని వదలగొట్టే బాబాల గురించి అందరూ చూపిస్తారు కానీ.. ఒక ముస్లిం అమ్మాయిని దయ్యంగా చూపించి.. తన నేపథ్యాన్ని సరికొత్తగా నరేట్ చేసిన తీరులో దర్శకుడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రేక్షకులు సినిమాలో కొత్తగా ఫీలయ్యేది దయ్యం ఫ్లాష్ బ్యాక్ విషయంలోనే. అందులో తీవ్రతను బాగా చూపించారు. ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని హీరో లవ్ ట్రాక్ ను తాపీగా చూపించి.. వేరే అనవసర సన్నివేశాలను కూడా నెమ్మదిగా నడిపించిన దర్శకుడు.. కథకు చాలా కీలకం అయిన ఫ్లాష్ బ్యాక్ విషయంలో మాత్రం బాగా హడావుడి పడ్డాడు. ఎవరో తరుముతున్నట్లుగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో ఈ సీన్లు లాగించేశాడు.

ప్రథమార్దంలో ఒక దశ వరకు 'మసూద' ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. పాత్రల పరిచయం.. ఆరంభ సన్నివేశాల విషయంలో దర్శకుడు బాగా టైం తీసుకున్నాడు. నరేషన్ కొంచెం భిన్నంగా అనిపిస్తుంది కానీ.. డెడ్ స్లో ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకులకు ఒళ్లు జిల్లుమనిపించేలా చేసిన ఇంటర్వెల్ సీన్ మినహాయిస్తే ప్రథమార్ధంలో స్టాండౌట్ గా నిలిచే సీన్లు తక్కువే. హీరో ఆఫీస్ సీన్లు.. లవ్ ట్రాక్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇంటర్వెల్ దగ్గర ఆసక్తి రేకెత్తించి.. మళ్లీ ద్వితీయార్ధంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది కథనం. దయ్యం ఫ్లాష్ బ్యాక్ నుంచి వేగం అందుకుని... ముగింపు వరకు మంచి టెంపోతోనే సాగుతుంది. ఐతే దయ్యం పాత్ర నేపథ్యం అదీ కొత్తగా అనిపించినా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ట్విస్టులైతే ఏమీ కనిపించవు. పతాక సన్నివేశాలు బాగానే అనిపించినా.. ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. చివరి గంటలో వయొలెన్స్ డోస్ బాగా ఎక్కువే. రక్తంతో తెర తడిసి ముద్దయిపోయింది. 'మసూద' టీం పడ్డ కష్టం అయితే తెర మీద కనిపిస్తుంది. ఉన్నంతలో మంచి ప్రయత్నమే చేశారు. కానీ హార్రర్ సినిమాలైనా.. థ్రిల్లర్లయినా.. సాగతీతగా అనిపించకూడదు. కథనం పరుగులు పెట్టాలి. హార్రర్ సినిమాకు 2 గంటల 40 నిమిషాల నిడివి అన్నది టూమచ్. ఇక్కడ 'మసూద'కు మైనస్ మార్కులు పడతాయి. లవ్ ట్రాక్ సహా కొన్ని అనవసర సన్నివేశాలను పరిహరించి.. కథనంలో కొంచెం వేగం పెంచి ఉంటే 'మసూద' మంచి స్థాయిలో నిలిచేది. హార్రర్ జానర్ ప్రియులు కొంచెం ఓపిక చేసుకోగలిగితే 'మసూద'పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

సంగీత చాన్నాళ్ల తర్వాత కీలక పాత్రలో నటించి మెప్పించింది. నీలమ్ పాత్రకు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. కథానాయికగా తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపించింది సంగీత. ఆమెలో మంచి నటి ఉందనే విషయం ఈ సినిమాలో తెలుస్తుంది. తిరువీర్ తన టాలెంటుని మరోసారి చూపించాడు. బాగా భయస్తుడు అయి ఉండి దయ్యంతో పెట్టుకునే పాత్రను అతను చాలా బాగా పండించాడు. దయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో బాంధవి శ్రీధర్ ఓకే అనిపించింది. 'గంగోత్రి'లో బాల నటిగా నటించి ఇందులో హీరోయిన్ అవతారం ఎత్తిన కావ్య కళ్యాణ్ రామ్ పర్వాలేదు. ఆమె ఒక మామూలు అమ్మాయిలా కనిపిస్తుంది. 'హీరోయిన్' లాగా అనిపించదు. శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. సహాయ పాత్రల్లో సత్యం రాజేష్.. సురభి ప్రభావతి.. సత్యప్రకాష్ బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

'మసూద'కు టెక్నికల్ హంగులు బాగానే కుదిరాయి. ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం.. నగేష్ బానెల్ విజువల్స్ ఒక హార్రర్ సినిమాకు అవసరమైన మూడ్ ను క్రియేట్ చేశాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. నిర్మాత రాహుల్ యాదవ్ మరోసారి తన అభిరుచిని చాటుకున్నాడు. స్క్రిప్టును తీర్చిదిద్దుకోవడంలో.. టేకింగ్ విషయంలో దర్శకుడు సాయికిరణ్ ప్రతిభ తెరపై కనిపిస్తుంది. కాకపోతే అతడి నరేషన్ డెడ్ స్లో. కథకు అవసరం లేని సన్నివేశాల మీద ఫోకస్ పెట్టి తప్పు చేశాడు. ఎడిటింగ్ టేబుల్ మీద అతను కసరత్తు చేసి ఉండాల్సింది. దర్శకుడిగా అతను తన ముద్రను సినిమాలో చూపించగలిగాడు.

చివరగా: విషయం ఉంది.... ఓపిక కావాలి

రేటింగ్-2.5/5