Begin typing your search above and press return to search.
డ్రగ్స్ న్యూస్.. ఆపండి బాబోయ్
By: Tupaki Desk | 24 July 2017 1:25 AM GMTదేశంలో ఏ భాషలోనూ లేనన్ని న్యూస్ ఛానల్స్.. మన తెలుగులో కనిపిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక కొన్ని ఛానల్స్ ఇప్పటికే తాము కూడా రెండేసి న్యూస్ ఛానల్స్ నడపడం ప్రారంభించాయి. ఎన్ని ఛానల్స్ ఉన్నా.. ఇప్పుడు అందరి హంగామా ఒక్క టాపిక్ మీదే నడుస్తోంది. ఏ ఛానల్ పెట్టినా.. ఏ టైంలో ట్యూన్ అయినా.. టాలీవుడ్ లో డ్రగ్స్ స్కాండల్ టాపిక్ తప్ప మరింకేమీ కనిపించడం లేదు.
ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కానీ.. సిట్ కానీ.. అకున్ సబర్వాల్ కానీ.. ఇప్పటివరకూ ఆయా వ్యక్తులకు నోటీసులు ఇచ్చామంటూ ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. కానీ మీడియా మాత్రం లీకుల పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ప్రచారం చేస్తున్నాయి. విచారణకు హాజరైన వ్యక్తుల గురించి కూడా.. విచారణకు సహకరిస్తున్నారని.. కొన్ని క్లూస్ ఇచ్చారని తప్ప మరే ఇతర వివరాలను ఎక్సైజ్ శాఖ చెప్పలేదు. కానీ ఛానల్స్ హంగామా మాత్రం మరీ దారుణంగా ఉంది. ఆయా తారలను ఏమేం ప్రశ్నలు వేశారు.. ఎన్నేసి ప్రశ్నలు వేశారు.. ఏ ఆర్డర్ లో క్వశ్చన్ చేశారు.. అలా ప్రశ్నించడానికి కారణం ఏంటి.. అంటూ పుక్కిటి పురాణాలను వండేసి.. అదే పనిగా ప్రసారం చేస్తున్నారు.
మా జీవితాలను నాశనం చేస్తున్నారు అంటూ పూరీ జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్ గోడు వెళ్లబుచ్చుకున్నా సరే.. వినడం లేదు. పైగా 'పూరీ గ్యాంగ్' అంటూ కొన్ని ఛానల్స్ చేస్తున్న కామెంట్స్ వింటే.. నిజంగా పూరీనే ఇదంతా నడిపిస్తున్నాడా అనిపించేయక మానదు. అలాగని మిగిలిన వాళ్లను కూడా ఏమీ వదిలిపెట్టడం లేదు. తరుణ్ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాయి ఛానల్స్. సినిమాలు మానేసి డ్రగ్స్ అమ్ముకుంటున్నావా అని అధికారులు క్వశ్చన్ చేశారని ఛానల్ లో కథనాలు వింటుంటే షాక్ కొట్టక మానదు.
విచారణ సమయంలో పక్కనే నుంచుని వార్తలు రాసినట్లుగా ఉంది ఛానల్స్ వ్యవహారం. ఇప్పటికే ఛానల్స్ లో కథనాలు చూస్తుంటే జనాలకు విరక్తి వచ్చేస్తోంది. అసలు దేశంలో ఏ ఇతర టాపిక్ కి లేనంత హంగామా ఈ డ్రగ్స్ ను కవరేజ్ చేసేందుకే కేటాయిస్తోంది టాలీవుడ్. ఆఖరికి కొత్త రాష్ట్రపతికి కానీ.. నార్త్ లో వరదలకు కానీ.. అనేక ప్రాంతాల్లో పడుతున్న కుండపోత వర్షాలకు.. అక్కడి జనాల ఇబ్బందులకు కూడా మీడియా ప్రాధాన్యత ఇవ్వడంలేదు.
ఇంతకీ ఇప్పుడు ఇంతగా ఈ వ్యక్తుల పరువు తీసి బజార్న పడేస్తున్న మీడియా.. కొన్ని రోజుల తర్వాత ఆయా వ్యక్తులు నిర్దోషులుగా నిరూపితం అయితే.. అప్పుడు వీరందరికీ క్షమాపణలు చెబుతుందా.. ఇప్పుడు ఎక్సైజ్ లీకులు అంటూ తమ కల్పిత గాధలు చెబుతున్న వారంతా.. అప్పుడు సెలబ్రిటీలకు కనీసం సారీ అయినా అంటారా? అయినా.. టీఆర్పీల కోసం ఇంతటి హంగామా అవసరమా? జనాలకే విరక్తి వచ్చేస్తున్నా.. వీరికి మాత్రం ఆ విషయం ఎందుకు అంతు బట్టడం లేదో!