Begin typing your search above and press return to search.

సింగం-3 సైడిచ్చిందో లేదో..

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:00 PM IST
సింగం-3 సైడిచ్చిందో లేదో..
X
సింగం-3 పుణ్యమా అని ఇప్పుడు కనీసం అరడజను సినిమాల రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొన్నటిదాకా డిసెంబరు 16నే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమాను రిలీజ్ చేస్తామన్న ‘ఎస్-3’ నిర్మాతలు.. సడెన్‌ గా ప్లేటు మార్చేశారు. అల్లు అరవింద్ బలవంతమో.. ఇంకేదైనా కారణమో కానీ.. ‘ఎస్-3’ డిసెంబరు 23కు ఫిక్సయింది. దీంతో ఆ వీకెండ్లో.. తర్వాతి వీకెండ్లో రావాల్సిన సినిమాలన్నీ డేట్లు మార్చుకోవాల్సి వస్తోంది. ఐతే ఆలస్యమైతే వేరే వాళ్లు దూరేస్తారని.. సాధ్యమైనంత వేగంగా డేట్లు ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. సూర్య సినిమా డిసెంబరు 16ను వదిలేస్తున్నట్లు ప్రకటన రావడం ఆలస్యం.. రెండు సినిమాలు ఆ తేదీకి కర్చీఫ్ వేసేశాయి.

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాను డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రకటించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం. దీన్ని బట్టి రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘నేను లోకల్’ 23 నుంచి అడ్వాన్స్ అయ్యే పరిస్థితి లేదని తేలిపోయింది. మరోవైపు 23న రావాల్సిన నవీన్ చంద్ర సినిమా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కూడా 16కే వచ్చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ సినిమా ‘వంగవీటి’ మాత్రం యధావిధిగా 23నే వస్తుందట. అల్లరి నరేష్ సినిమా 30నే రిలీజయ్యే అవకాశముంది. 23న అమీర్ ఖాన్ ‘దంగల్’ తెలుగు వెర్షన్ కూడా యధావిధిగా రిలీజవుతుంది. ఐతే డిసెంబరు 9న ‘ధృవ’.. 23న ‘ఎస్-3’ వస్తున్న నేపథ్యంలో మధ్యలో16న వచ్చే సినిమాలకు అంత వీజీయేమీ కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/