Begin typing your search above and press return to search.

వెండితెరపైకి అందాల తార కూతురు

By:  Tupaki Desk   |   27 Jun 2015 11:30 AM GMT
వెండితెరపైకి అందాల తార కూతురు
X
90ల్లో సినిమాలు చూసిన వాళ్లెవరూ మీనాను అంత ఈజీగా మరిచిపోలేరు. ఇటు తెలుగులో, అటు తమిళంలో టాప్‌ స్టార్స్‌ అందరితో కలిసి నటించిన మీనా కెరీర్లో ఎన్నో మైలురాళ్లున్నాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాక సీరియళ్లలో కూడా నటించి మెప్పించిన మీనా.. 2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. ఆ తర్వాత కూడా దృశ్యం లాంటి ఒకట్రెండు సినిమాల్లో కనిపించిన మీనా.. ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటోంది. ఐతే మీనా ఇంటి నుంచి ఇప్పుడు మరో ఆర్టిస్ట్‌ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు.

ఆ ఆర్టిస్ట్‌ మరెవరో కాదు.. మీనా కూతురు నైనిక. ఈ చిన్నారికి ఇప్పుడు నాలుగేళ్లు. స్టార్‌ హీరో విజయ్‌ సినిమాతో ఈ అమ్మాయి తెరంగేట్రం చేయబోతోంది. 'రాజారాణి' ఫేమ్‌ అత్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయిక. నైనిక పాత్రేంటన్నది తెలియలేదు కానీ.. విజయ్‌ బలవంతం మేరకే మీనా తన కూతురిని ఈ సినిమాలో నటింపజేస్తోందట. విజయ్‌ తన ఫేవరెట్‌ హీరోయిన్‌ మీనా అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఓ సినిమాలో అతడితో కలిసి ఓ పాట కూడా చేసింది మీనా. ఆమె మీద అభిమానంతోనే తన కూతురిని పట్టుబట్టి తన సినిమాలో నటించేలా చేస్తున్నాడట విజయ్‌. తల్లిలాగే పిల్ల కూడా బాలనటిగా తెరంగేట్రం చేయబోతోంది. ఆ తర్వాత సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతుందేమో చూద్దాం.