Begin typing your search above and press return to search.

ఆక్సీజ‌న్ కూడా లేదు.. 18 శాతం జీఎస్టీ ఎందుకు క‌ట్టాలిః హీరోయిన్‌

By:  Tupaki Desk   |   18 May 2021 9:30 AM GMT
ఆక్సీజ‌న్ కూడా లేదు.. 18 శాతం జీఎస్టీ ఎందుకు క‌ట్టాలిః హీరోయిన్‌
X
క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ.. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించింద‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతోమంది ప్ర‌ముఖులు విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ మీడియా కూడా కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టింది. ఆ త‌ర్వాత భార‌తీయ‌ సినీ ప్ర‌ముఖులు కూడా ఒక్కొక్క‌రుగా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.

ఇటీవ‌ల‌ గంగాన‌దిలో తేలియాడుతున్న మృత‌దేహాలను చూసి బాలీవుడ్ నటుడు.. ఫిల్మ్ మేక‌ర్‌ ఫర్హాన్ అక్తర్ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘మృత‌దేహాలను చూస్తే హృదయ విదారకంగా ఉంది. వైరస్ ఏదో ఒక రోజు ఓడిపోతుంది. కానీ.. వ్యవస్థలో ఈ వైఫల్యాలకు మాత్రం జవాబుదారీతనం ఉండాలి. అప్పటి వరకు ఈ మహమ్మారి అధ్యాయం ముగిసిన‌ట్టు కాదు.’’ అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

ఇక బాలీవుడ్ నటి-చిత్రనిర్మాత పూజా భట్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘మీరు మృతుల సంఖ్య‌ను దాచ‌గ‌ల‌రు.. మృతదేహాలను దాచ‌గ‌ల‌రా? ఇది రాబోయే తరాల వరకు మనల్ని వెంటాడుతుంది’’ అని ఘాటుగా స్పందించారు. ఊర్మిళ, శేఖర్ సుమన్ కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా.. హీరోయిన్ మీరా చోప్రా కేంద్రం ప్ర‌భుత్వాన్ని సూటిగా నిల‌దీశారు. క‌రోనా బాధితుల‌కు ఆసుప‌త్రుల్లో బెడ్ దొర‌క‌ట్లేద‌ని, క‌ష్ట‌ప‌డి బెడ్ సంపాదించినా.. ఆక్సీజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ప్ర‌జ‌ల‌కు క‌నీసం ఆక్సీజ‌న్ కూడా అందించ‌లేన‌ప్పుడు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాల‌ని ప్ర‌శ్నించారు. వైద్య అవ‌స‌రాల‌పై జీఎస్టీని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా కార‌ణంగా.. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న కుటుంబంలో ఇద్ద‌రిని కోల్పోయారు మీరా చోప్రా.