Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మనసుని హత్తుకునే భావోద్వేగాల 'మీట్ క్యూట్'..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 7:26 AM GMT
ట్రైలర్ టాక్: మనసుని హత్తుకునే భావోద్వేగాల మీట్ క్యూట్..!
X
నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఆంథాలజీ సిరీస్ "మీట్ క్యూట్". నాని సోదరి దీప్తి ఘంటా ఈ సిరీస్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతోంది. ఇటీవల వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను ఈరోజు లాంచ్ చేసారు.

"మీట్ క్యూట్" టీజర్ లో అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటుగా.. అన్ని రకాల భావోద్వేగాలను చూపించారు. ఇప్పుడు నాని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్ లో ఈ సిరీస్ దేని గురించనేది మరింత ఎక్కువగా వివరిస్తుంది.. ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.

"నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ ఫస్ట్ టైం కలిసినప్పుడు.. ఆ క్యూట్ సిచ్యువేషన్స్.. వాళ్ళ మధ్య సంభాషణలు మరియు జీవితకాలం నిలిచిపోయే జ్ఞాపకం" అని నాని చెప్తుండటంతో ఈ ట్రైలర్ లో ప్రధాన పాత్రల మధ్య క్యూట్ సీన్లను చూపించారు.

కొన్ని అర్బన్ ప్రేమ కథలను.. విభిన్న ప్రేమ పక్షుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే మనం గొడవ పడతాం అనే సందేశాన్ని ఈ ఆంథాలజీ అందిస్తోంది.

సమకాలీన అంశాలతో రొమాంటిక్ డ్రామాగా మీట్ క్యూట్ తెరకెక్కింది. ప్రతి కథకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. అలానే ఈ తరం యువతకు చాలా సందర్భోచితంగా ఉంది. సిరీస్‌ లోని పెద్దలు రెండు తరాల మధ్య వారధిగా కనిపిస్తున్నారు.

ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, నమ్మకం, ఆనందం వంటి అన్ని రకాల భావోద్వేగాల సమ్మేళనంగా మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సీరీస్ ఉండబోతోందని అర్థమవుతుంది. ఎమోషన్స్ అన్నీ చాలా రియల్ గా అనిపించేలా దీప్తి గంటా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో పాటు సిరీస్ కు తగినట్లుగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ ను కలిగి ఉంది. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. గ్యారీ బిహెచ్‌ ఎడిటింగ్‌ వర్క్ చేశారు.

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని 'మీట్ క్యూట్' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్ - రోహిణి మొల్లేటి - అదా శర్మ - వర్షా బొల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహాని శర్మ - సునయన - సంచిత - అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య - రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

"మీట్ క్యూట్" ఆంథాలజీ సిరీస్ ను సోనీ లివ్‌ ఓటీటీలో నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.