Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్‌ మరో రిస్కీ ప్రయత్నం

By:  Tupaki Desk   |   27 May 2022 5:30 AM GMT
మెగా బ్రదర్‌ మరో రిస్కీ ప్రయత్నం
X
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్‌ లను దక్కించుకోలేక పోయాడు. అన్నయ్య చిరంజీవి మరియు తమ్ముడు పవన్‌ కళ్యాణ్ లు స్టార్‌ లుగా.. సూపర్ స్టార్‌ లుగా టాలీవుడ్‌ లో దూసుకు పోతున్న ఈ సమయంలో నాగబాబు మాత్రం నటుడిగా చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ.. బుల్లి తెరపై కనిపిస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతున్నాడు. ఫుల్ టైమ్‌ నటుడిగా ఆయన చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

పెద్ద సినిమాల్లో లేదా తనకు ఆప్తులు అయిన వారి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఉన్న నాగబాబు నిర్మాణం పై మళ్లీ దృష్టి పెట్టారా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. నాగబాబు నిర్మాతగా చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు. ముఖ్యంగా నాగబాబు ఆరంజ్ సినిమా తో నిర్మాతగా డిజాస్టర్‌ ను చవి చూసి కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఆ సమయంలో పవన్‌ సాయం చేశాడు అనేది కూడా ప్రచారం.

ఆరెంజ్ దెబ్బ తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నాగబాబు చాలా కాలం తర్వాత నా పేరు సూర్య సినిమా తో నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా నిర్మాణంలో చిన్న షేర్‌ తీసుకున్నాడు. కాని ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. మళ్లీ నాగబాబు నిర్మాణం గురించి పెద్దగా ఆలోచించిందే లేదు. తమ్ముడు పవన్ కాని.. అన్నయ్య చిరంజీవి కాని నాగబాబు అడిగితే డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉంటారు.

నాగబాబు మాత్రం వారితో సినిమాలు చేయాలని భావించినట్లుగా లేడు. ఇప్పుడు తనయుడు వరుణ్‌ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు కనుక ఆయనతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వరుణ్‌ తేజ్ ఇప్పటికే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమాను కన్ఫర్మ్‌ చేశాడు. ఎఫ్ 3 హడావిడి పూర్తి అయిన వెంటనే ప్రవీణ్‌ సత్తార్ మూవీ ప్రారంభం అవ్వబోతుంది.

ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. తమ కాంబోలో సినిమా ను అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఆ సినిమాను బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ తో కలిసి నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో నిర్మించబోతున్నాడట. యూఎస్‌ లో మెజార్టీ రోజుల షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కాస్త ఎక్కువ బడ్జెట్‌ తోనే సినిమా ఉండబోతుందని వరుణ్‌ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

నాగబాబు భారీ బడ్జెట్‌ తో సినిమా అంటే ఖచ్చితంగా రిస్కీ అనే చర్చ జరుగుతోంది. వరుణ్‌ ఇప్పుడిప్పుడే కెరీర్‌ లో నిలదొక్కుకుంటున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టగల స్టామినా ఇంకా వరుణ్ కు లేదు. కనుక నాగబాబు భారీ బడ్జెట్‌ అంటే కాస్త రిస్కీ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో నిర్మాతతో కలిసి కొంత షేర్ కనుక భారీ నష్టం ఉండక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి నాగబాబు నిర్మాతగా మరో ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.