Begin typing your search above and press return to search.

చిరంజీవి ప్రచారం.. మెగా ఫ్యామిలీ క్లారిటీ

By:  Tupaki Desk   |   4 April 2019 6:49 AM GMT
చిరంజీవి ప్రచారం.. మెగా ఫ్యామిలీ క్లారిటీ
X
తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ఏపీ ఎన్నికలను ఊడ్చేస్తున్నాడు. మరో తమ్ముడు నాగబాబు నర్సాపురం ఎంపీగా జనసేన తరుఫున పోటీచేస్తూ కష్టపడుతున్నాడు.. తమ్ముళ్లిద్దరూ రాజకీయ ఆటలో దిగి కష్టపడుతుంటే అన్నయ్య చిరంజీవి మాత్రం సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ప్రచారానికి రాకుండా.. కనీసం తన మద్దతు తమ్ముళ్లు ఇద్దరికీ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

చిరంజీవి తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాత్రం చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 8న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సినీ నటుడు చిరంజీవి వికారాబాద్ సభలో పాల్గొంటారని చెబుతున్నాడు. వీరిద్దరూ కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుఫున ప్రచారం చేస్తారని ఆయన ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

తమ్ముళ్లు ఇద్దరూ ఏపీలో ఎన్నికల కోసం పోరాడుతుంటే వారిని వదిలేసి తెలంగాణలో చిరంజీవి ప్రచారం చేయడమేంటన్న ప్రశ్నలు జనసేన అభిమానులు, ఇతర ప్రముఖుల నుంచి వెల్లువెత్తాయి. దీంతో దీనిపై తాజాగా చిరంజీవి కుటుంబం స్పష్టతనిచ్చింది. చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం తేల్చిచెప్పింది..

చిరంజీవి ఈ సారి ఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడని.. తెలంగాణలో పాల్గొంటాడని వస్తున్న వార్తలు అవాస్తవమని చిరు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీలోనూ తమ్ముళ్లు పవన్, నాగబాబు తరుఫున ప్రచారం చేయడని తెలిపారు. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారని.. ఎన్నికలకు ముందు ప్రచారానికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు.