Begin typing your search above and press return to search.

చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న మెగా అభిమానులు

By:  Tupaki Desk   |   13 Feb 2022 1:53 AM GMT
చిరంజీవి, పవన్ మధ్య నలిగిపోతున్న మెగా అభిమానులు
X
ముందు నుయ్యి.. వెనుక గొయ్యలా మారిందట మెగా ఫ్యాన్స్ పరిస్థితి. అటు ఏమో అన్నయ్య చిరంజీవి రాజకీయాలను పక్కనపెట్టి ఏపీ సీఎం జగన్ ను కొనియాడుతూ.. ఆయనతో స్నేహం చేస్తూ టాలీవుడ్ సమస్యలు పరిష్కరించేందుకు వడివడిగా ముందుకెళుతున్నారు. ఇటు ఏమో పవన్ కళ్యాణ్ ఫక్తు రాజకీయ నేతగా మారి ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా రాజకీయం పండిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి అందరి సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వంతో.. సీఎం జగన్ తో సఖ్యతతో ఉంటున్నారు. తమ్ముడు పవన్ బీజేపీతో జట్టుకట్టి జగన్ పై విరుచుకుపడుతున్నా.. చిరంజీవి మాత్రం జగన్ చేసే మంచి కార్యక్రమాలను అభినందిస్తూనే ఉన్నారు. ఇదే ఇప్పుడు మెగా అభిమానులను డిఫెన్స్ లో పడేస్తోంది.

ఏపీలో షూటింగ్ ల దగ్గర నుంచి సినిమాలకు ఏ అడ్డంకి లేకుండా చిరంజీవి ఏపీ ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. థియేటర్లకు కరోనా వేళ ఆక్యూపెన్సీ, టికెట్ రేట్లు సహా బెనిఫిట్ షోలకు ఇబ్బందులు కలుగుకుండా తాజాగా చర్చలు జరిపి మరీ జగన్ ను ఒప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా చిరు ఆ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్ కూడా చిరంజీవిని స్వయంగా సన్మానించారు.

చిరంజీవి తొలి నుంచి వైసీపీకి మద్దతు దారుడిగా ఉన్నారు. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్దతు ఇచ్చారు. అలాగే కరోనా విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలను జగన్ దృష్టికెళుతున్నారు.

ఇక ఇదే సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జనసేనను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిరంజీవి సపోర్టుతో వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఈ పర్యటనను వాడుకుంటున్నారు. చిరంజీవి తో జగన్, వైసీపీ మంత్రుల సాన్నిహిత్యాన్ని జనసైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జనసైనికులు చిరంజీవిని ఓన్ చేసుకోలేక నలిగిపోతున్నారు.

తాజాగా చిరంజీవి జగన్ ను మూడుసార్లు కలవడం.. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించడం జనసైనికులకు కంటగింపుగా మారింది. అయితే చిరంజీవి పర్యటనను ఎవరూ తప్పుపట్టడం లేదు. పైగా చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేరు. వచ్చే అవకాశం కూడా లేదని.. ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.జగన్ ను చిరు కలవడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే జగన్ ను పొగడ్తలతో చిరు ముంచడం.. ఆయనకు చేతులు జోడించి నమస్కరించడం.. ఇండస్ట్రీని కాపాడాలని వేడుకోవడం మెగా అభిమానులను డోలాయమానంలోకి నెట్టేస్తున్నాయి.

చిరంజీవి అంతటి వాడే జగన్ ను ఇలా ఆకాశానికి ఎత్తేస్తే రేపు పవన్ కు అనుకూలంగా.. జగన్ కు వ్యతిరేకంగా ఎలా వ్యవహరించాలనేది మెగా అభిమానులకు అంతుబట్టడం లేదు. జగన్ ను చిరంజీవి ఫాలో అవుతుండడం.. పవన్ వ్యతిరేకిస్తుండడంతో ఎటువైపు వెళ్లాలి? ఎలా నడవాలి? ఎవరికి ఫాలో కావాలి అనే అంశాలపై మెగా అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుందో చూడాలి.