Begin typing your search above and press return to search.

చెప్పిన వెంట‌నే చెత్త క్లీన్ చేయించిన సాయితేజ్!

By:  Tupaki Desk   |   22 Sep 2022 3:30 PM GMT
చెప్పిన వెంట‌నే చెత్త క్లీన్ చేయించిన సాయితేజ్!
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ క‌థానాయ‌కుడిగా త‌న 15వ చిత్రం కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ హీరో యాక్సిడెంట్ త‌ర్వాత ప్రారంభించిన చిత్ర‌మిది. భారీ యాక్సిడెంట్ కార‌ణంగా కొన్ని నెల‌లు పాటు ఇంటికే ప‌రిమిత‌మైన తేజ్ మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చి కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఆమ‌ధ్య కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసి బ్రేక్ ఇచ్చారు.

మ‌ళ్లీ ఇటీవలే బ్యాలెన్స్ షూట్ ని పూర్తిచేసే ప‌నిలో టీమ్ నిమ‌గ్న‌మైంది. దీనిలో భాగంగా ష‌ర వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవ‌లే కుత్బుల్లాపూర్‌లో హెచ్ ఎంటీ అర్బన్ ఫారెస్ట్రీలో క్లిష్టమైన ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసారు. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆ ప్రాంత‌మంతా చింద‌ర వంద‌ర‌గా త‌యారైంది. షూటింగ్ స్పాట్ లో చెత్తా చెదారం వ్య‌ర్ధాల‌తో అశుభ్రంగా మారిపోయింది.

షూటింగ్ అంటే వంద‌లాది మంది పాల్గొన‌డంతో మ‌రింత అద్వానంగా ఆ ప్రాంతం క‌నిపిస్తుంది. ఇలాంటి వ్య‌ర్ధాలు జంతువుల‌కు హానికరం. ఇదే విష‌యాన్ని ఒక నెటిజనుడు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చాడు. ఆ ప్రాంత‌మంతా వ్య‌ర్ధాల‌తో నిండిపోయింది. కావునా తగిన చర్యలు తీసుకోవాలని చిత్ర టీమ్ ని.. సాయి ధరమ్ తేజ్ మరియు జీహెచ్ ఎంసీ అధికారులను ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్‌పై సాయితేజ్ వెంటనే స్పందించారు. `ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. నా బృందం దీన్ని వెంటనే చూసుకుంటుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంద‌న్నారు. ఆ వెంట‌నే సాయి ధరమ్ తేజ్ టీమ్ చెత్త మొత్తం తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.

టీమ్‌ని రిక్వెస్ట్ చేసిన నెటిజన్ ఆ తర్వాత క్లీనింగ్ చేసిన ఫొటోలను కూడా స్వయంగా పోస్ట్ చేశాడు. దీంతో సాయితేజ్ పై నెటి జ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. విష‌యం తెలియ‌గానే వెంట‌నే స్పందించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇదే ప‌ని నెటి జ‌నుడు చెప్ప‌క ముందే చేసి ఉంటే ఇంకా బాగుండేద‌ని మరికొంత మంది అభిప్రాయ‌ప డుతున్నారు. వాస్త‌వానికి ఆ ప‌నుల‌న్నింటిని నిర్మాణ సంస్థ‌కు చెందిన వారు చూసుకోవాల‌న్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.