Begin typing your search above and press return to search.

2018 రివ్యూ: మెగా గుణ‌పాఠం

By:  Tupaki Desk   |   26 Dec 2018 1:30 AM GMT
2018 రివ్యూ: మెగా గుణ‌పాఠం
X
2018కొంద‌రికి మోదం.. కొంద‌రికి ఖేదం. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల ట్రాక్ రికార్డ్ ప‌రిశీలిస్తే ప్ర‌తికూల ఫ‌లితాలు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌లేద‌నే భావించాలి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` ఇండ‌స్ట్రీలో రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ అద్భుత విజ‌యం సాధించింది. దాంతో పాటు వ‌రుణ్ తేజ్ `తొలి ప్రేమ‌` హిట్టు కొట్టింది. ఆ ఇద్ద‌రూ మెగా కాంపౌండ్ కి రిలీఫ్‌ అనుకుంటే.. ఇత‌ర మెగా హీరోలంతా ప్లాపుల బాట ప‌ట్ట‌డం తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది.

మెగాస్టార్ చిరంజీవి `ఖైదీనంబ‌ర్ 150` త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. అందువ‌ల్ల ఆయ‌న న‌టించిన సినిమా ఏదీ 2018లో రిలీజ్ కాలేదు. ప్ర‌స్తుతం `సైరా- న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఈ ఏడాదికి చిరు సైడైపోయారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించిన `అజ్ఞాతవాసి` చిత్రం డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకుంది. ఈ సినిమా నిరాశ‌ప‌రిచాక మ‌రో సినిమా మాట ఎత్త‌కుండా ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల‌కే అంకిత‌మ‌య్యారు.

ఇత‌ర మెగా హీరోల్ని ప‌రిశీలిస్తే.. స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ `నా పేరు సూర్య‌` చిత్రంతో డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్నాడు. తానొక‌టి త‌లిస్తే అన్న‌చందంగా అవ్వ‌డంతో బ‌న్ని చాలానే నిరాశ‌ప‌డ్డాడు. ఎన‌ర్జిటిక్ హీరో సాయిధ‌ర‌మ్ కెరీర్ రెండు డిజాస్ట‌ర్ల‌తో డీలా ప‌డిపోయింది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలోని ఇంటెలిజెంట్ - క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `తేజ్‌.. ఐ ల‌వ్ యు` చిత్రాలు డిజాస్ట‌ర్ల‌య్యాయి. దీంతో సాయిధ‌ర‌మ్ తీవ్రంగా నిరాశ‌ప‌డ్డాడు. అల్లు శిరీష్ కి సినిమాలేవీ లేవు. ఓన్లీ `ఏబీసీడీ` డ‌బ్బింగ్ రిలీజ్ త‌ప్ప స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ రాలేదు. నాగ‌బాబు కుమారుడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక హిట్టు - ఒక‌ ఫ్లాపుతో ఓకే అనిపించాడు. ప్ర‌థ‌మార్థంలో వ‌రుణ్ తేజ్ న‌టించిన `తొలి ప్రేమ‌` రిలీజై హిట్ కొట్టింది. ఏడాది ద్వితీయార్థం ముగింపులో రిలీజైన `అంత‌రిక్షం` నిరాశ‌ప‌రిచింది. టాలీవుడ్ లో ప్ర‌యోగాల హీరోగా వ‌రుణ్ తేజ్‌ కి గుర్తింపు అయితే ద‌క్కింది. మెగా ప్రిన్సెస్ నీహారిక‌ ఫ్లాప్ షోపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. నిహారిక న‌టించిన `హ్యాపీ వెడ్డింగ్‌` ఫ్లాప్ గా నిల‌వ‌డం నిరాశ‌ప‌రిచింది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ డెబ్యూ సినిమా `విజేత‌` అప‌జ‌యం ఎదుర్కొంది. తప్పులు చేయ‌డం స‌హ‌జం. కానీ ఈ అప‌జ‌యాల నుంచి మెగా హీరోలు గుణ‌పాఠం నేర్చుకుని 2019లో స‌రైన ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళ‌తార‌నే భావిద్దాం. 2018 త‌ర‌హాలోనే రామ్ చ‌ర‌ణ్ సంక్రాంతి రిలీజ్ తో ఖాతా ఓపెన్ చేస్తున్నాడు. కొత్త సంవ‌త్స‌రంలో జ‌న‌వ‌రి 11న చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విధేయ రామా` భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ‌వుతోంది. ఓపెనింగ్ బ్యాట్స్ మ‌న్ జోరు బావుంటే.. టీమ్ అంతా ఊపేస్తుంది! అన్న చందంగా చ‌ర‌ణ్ హిట్టింగ్ పైనే అభిమానుల అంచ‌నాలు రెట్టించాయి. ఆరంభం బావుంటుంద‌నే ఆశ‌.