Begin typing your search above and press return to search.

ఆగస్టు టార్గెట్‌... ఆచార్య పునః ప్రారంభం

By:  Tupaki Desk   |   7 July 2021 8:43 AM GMT
ఆగస్టు టార్గెట్‌... ఆచార్య పునః ప్రారంభం
X
మెగా స్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా గత ఏడాదిలోనే ముగించాలని భావించినా కరోనా వల్ల వాయిదా పడింది. సరే ఈ ఏడాది ఆరంభంలో షూటింగ్ పూర్తి చేసి మే నెలలో విడుదల చేయాలనుకుంటే సెకండ్‌ వేవ్ కారణంగా వాయిదా పడింది. షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నుండి బయట పడటంతో మళ్లీ షూటింగ్ లు పునః ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున సినిమాలు షూటింగ్‌ జరుగుతున్నా ఆచార్య షూటింగ్‌ ప్రారంభం అవ్వక పోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఎట్టకేలకు నేటి నుండి ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు.

చిరంజీవి తో పాటు చరణ్‌ మరియు సోనూసూద్‌ ఇంకా కీలక నటీ నటులపై దర్శకుడు కొరటాల సీన్స్‌ షూటింగ్‌ ను మొదలు పెట్టాడట. వారం నుండి పది రోజుల్లోనే ఈ షెడ్యూల్ ను ముగిస్తారని సమాచారం అందుతోంది. పూర్తి జాగ్రత్తల మద్య ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల షూటింగ్ ను ముగించడమే కాకుండా వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా విడుదల తేదీ గురించి ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మొదట భావించినా కూడా ఆ సమయంలో ఇతర సినిమా లు పెద్ద ఎత్తున విడుదల అయ్యే అవకాశం ఉంది. కనుక ముందుగానే అంటే ఆగస్టులోనే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

జులై మూడు వారం నుండి థియేటర్లు ఓపెన్‌ అవుతాయని.. ఆగస్టు మొదటి వారంకు థియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. అందుకే థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే అంటే ఆగస్టులోనే ఆచార్య ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారట. సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌ లో మళ్లీ కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. కనుక థర్డ్‌ వేవ్‌ కంటే ముందుగానే ఈ సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తే ఒక పనైపోతుందని మేకర్స్‌ భావిస్తున్నారట.

చిరంజీవి సినిమా కనుక కరోనాను లక్ష్య పెట్టకుండా ప్రేక్షకులు క్యూ కడతారు. కనుక ఆచార్య సినిమా ఏ సమయంలో విడుదల అయినా కూడా బిజినెస్ విషయంలో రికార్డులు బ్రేక్‌ అవ్వడం ఖాయం. ఇక సినిమాకు ఏమాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా వసూళ్లు రికార్డు బ్రేకింగ్‌ లో నమోదు అవుతాయని అంటున్నారు. మొత్తానికి ఆచార్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్‌ చరణ్ ఈ సినిమా లో కీలక పాత్రను పోషించడం మొదలుకుని సోను సూద్‌ విలన్ గా నటించడం.. ఐటెం సాంగ్‌ రెజీనా చేయడం ఇలా ప్రతి విషయం వల్ల ఆచార్య పై అంచనాలు పెరిగాయి. ఇంతగా అంచనాలు ఉన్న ఆచార్య సినిమా ఆగస్టు లో రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. టార్గెట్‌ ఆగస్టుగా రెడీ అవుతున్న ఆచార్య అనుకున్న తేదీకి వస్తుందా అనేది చూడాలి.

చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్‌ చరణ్‌ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమాకు మణిశర్మ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే విడుదల అయిన లాహె లాహె పాట యూట్యూబ్‌ తో పాటు అన్ని ప్లాట్ ఫామ్స్ పై రికార్డు స్థాయిలో వ్యూస్‌ మరియు ప్లే స్ ను దక్కించుకుంది. షూటింగ్ పూర్తి అయిన వెంటనే రెండవ పాటను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆగస్టులో సినిమా విడుదల చేయలేని పరిస్థితి ఉంటే సినిమాను దసరా లేదా దీపావళికి విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది.