Begin typing your search above and press return to search.

నా కంటే పెద్దోళ్ళు ముదుర్లున్నారు...మెగాస్టార్ కామెంట్స్

By:  Tupaki Desk   |   29 Dec 2022 11:17 AM GMT
నా కంటే పెద్దోళ్ళు ముదుర్లున్నారు...మెగాస్టార్ కామెంట్స్
X
టాలీవుడ్ పెద్ద అనిపించుకోవడం తనకు అసలు ఏ మాత్రం ఇష్టం లేదని మెగాస్టార్ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఈరోజు చిత్రపురి కాలనీలోని ఎంఐజీ, హెచ్‌ఐజీ గృహ సముదాయం ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. తాను సినీ పెద్దగా ఉండడం అంటే ఇబ్బంది పడతాను అని అన్నారు. తనను కావాలనే పెద్దగా చేస్తున్నారు అని ఆయన అంటూ తనకంటే పెద్దలుగా నిర్మాత సి కళ్యాణ్, వెటరన్ సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజా ఉన్నారని అన్నారు.

వారు ముదుర్లు అన్ని విధాలుగా తన కంటే పెద్ద వాళ్ళు అంటూ మెగాస్టార్ చెప్పడం విశేషం. తనకు సినీ పరిశ్రమ కష్టాలు తెలుసు అని తాను వాటి పరిష్కారానికి ఎప్పుడూ కృషి చేస్తాను అని అన్నారు. అలాగే తన శక్తి మేరకు అందరి మేలు కోసం పాటుపడతాను అని ఆయన చెప్పారు. తాను కార్మికుల పక్షం ఉంటాని, తన ఇంటి తలుపు ఎవరైనా ఎపుడైనా తట్టవచ్చు అని ఆయన అన్నారు.

దేశంలో ఏ సినీ పరిశ్రమలో ఎక్కడా లేని విధంగా టాలీవుడ్ లో సినీ కార్మికులకు సొంత ఇంటి నిర్మాణం ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం అని ఆయన అన్నారు. నాడు సీనియర్ నటుడు ప్రభాకరెడ్డి కృషి వల్లనే చిత్రపురి కాలనీ ఏర్పడింది అని ఆయన గతన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత దాసరి నారాయణరావు కె రాఘవేంద్రరావు వంటి పెద్దలు కూడా ఎంతో చేశారని అందరి సహకారం వల్లనే ఈ రోజు కార్మికుల సొంతింటి కల నిజం అయింది అని ఆయన అన్నారు.

ఇక తాను సినీ పరిశ్రమకు అండగా ఎపుడూ ఉంటాను అని మరోమారు చిరంజీవి నొక్కి చెప్పారు. తన బాధ్యత విషయంలో ఎవరూ గుర్తు చేయకుండానే తాను వచ్చి సహకారం ఇస్తాను అని ఆయన చెప్పారు. అదే విధంగా తాను పెద్ద అన్న పదాన్ని బాధ్యతను స్వీకరించలేను అని తనకు కుర్చీలలో కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు అని చిరంజీవి చెప్పారు.

తాను అందరి వాడిని అని అలాగే తాను అందరికీ సాయం చేస్తాను అని ఆయన మనసు విప్పి మాట్లాడారు. ఇదిలా ఉండగా చాలా కాలంగా చిరంజీవి ఇదే మాటను అంటున్నారు. ఆయన సినీ పెద్దగా సినీ పరిశ్రమ మొత్తం చెబుతోంది. ఆయన మాత్రం తనకు ఆ ఉన్నతాసనం వద్దు అనే అంటున్నారు. నిజానికి చిరంజీవి లేకుండా ఆయన సూచనలు సలహాలు లేకుండా టాలీవుడ్ లో ఎవరూ ముందుకు కదిలే పరిస్థితి లేదు. కానీ చిరంజీవి మాత్రం పెద్ద అనకుండా తనను కూడా బిడ్డగానే చూడమంటున్నారు.

ఇక్కడ చిరంజీవి మరో మంచి మాట చెప్పారు. తనకు సినీ పరిశ్రమ తాను కోరుకున్న దాని కంటే కూడా ఎక్కువ ఇచ్చిందని, అందువల్ల తాను ఇక మీదట తన శక్తివంచన లేకుండా అందరి మేలు చూస్తాను అని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా చిరంజీవి మాటలు చాలా ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.