Begin typing your search above and press return to search.

చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి ఆస్పత్రి నిర్మాణం

By:  Tupaki Desk   |   22 Aug 2021 10:30 AM GMT
చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి ఆస్పత్రి నిర్మాణం
X
24 క్రాఫ్టుల సినీ కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు.

చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ...చిరంజీవి గారి పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నామని శ్రీకాంత్ గారికి చెప్పగానే తప్పకుండా వస్తాను.. దాని కోసం మీరు నా దగ్గరకు ప్రత్యేకంగా రావొద్దు అని చెప్పారు. శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. రక్తం సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా రక్తదానం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం వెళ్లి కలిసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని మాటిచ్చారు. గతంలోనూ మా సినీ కార్మికుల సమస్యల గురించి చాలా సేపు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. చిత్ర పరిశ్రమకు దాసరి గారు లేని లోటు చిరంజీవి గారు తీరుస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి మాటిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి మొత్తం సినీ కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నారు.

చిత్రపురి హౌసింగ్ సొసైటీ కార్యదర్శి కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిత్రపురి కాలనీలో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు శ్రీకాంత్ గారు రావడం చిరంజీవి గారు వచ్చినట్లే ఉంది. చిరంజీవి గారి ప్రియ సోదరుడు శ్రీకాంత్ గారు. సినీ కార్మికులన్నా.. పేదలన్నా చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. చిత్రపురి కమిటీ తరుపున మేము ఎప్పుడు కలిసినా చిరంజీవి గారు ఒకటే అంటారు ఇది మన ఇండస్ట్రీ మన కార్మికులు. ఇలా వారి బాగు కోసం ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. సీసీసీ ద్వారా కరోనా కష్టకాలంలో ఆదుకున్నారు. చిత్రపురిలో ఆస్పత్రి నిర్మాణం చేయబోతున్నారు. చిరంజీవి గారు ఎంత పెద్ద స్టారో అంతే పెద్ద మనసున్న మనిషి... అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం.. రావాల‌ని కోరారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం. అలా పాల్గొంటే ఆ పుణ్యం నాకు కూడా కొంత వస్తుందని నమ్ముతాను. సినీ కార్మికులంతా మన ఫ్యామిలీ. చిరంజీవి గారి మంచి మనసు గురించి మనందరికీ తెలుసు. కరోనా టైమ్ లో సీసీసీ ద్వారా చిత్ర పరిశ్రమలోని కార్మికులందరినీ ఆదుకున్నారు. అది కేవలం ఆయన ఒక్కటి ఆలోచన మాత్రమే. మేమంతా అందుకు సపోర్ట్ చేశాం. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని మెగాస్టార్ చెప్పడం సంతోషంగా ఉంది. అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ సభ్యులు పీఎస్ఎన్ దొర- అళహరి- అనిత ఇతర కార్మిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు.