Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇష్టం.. పవర్ స్టార్ తో కష్టం..?

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 AM GMT
మెగాస్టార్ ఇష్టం.. పవర్ స్టార్ తో కష్టం..?
X
మెగాస్టార్ చిరంజీవి అందరి వాడు అని అప్పట్లో ఒక సినిమా తీశారు. అది పెద్దగా విజయవంతం కాకపోయినా ఆ టైటిల్ మాత్రం అచ్చంగా చిరంజీవికి నప్పుతుంది. నిజానికి ఆయన సినీ పరిశ్రమ లోపలా బయటా కూడా అజాత శతృవు, వివాదరహితుడు, పెద్ద మనిషి అన్న పేరుకు నూరు పాళ్ళు ఆయనే చేయగలవాడు. అలాంటి చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు.

ఆయనలో ఉన్నది పట్టుదల, లేనిది గర్వం. ఆయన ప్రతిభ ఎవరి దగ్గర ఉన్నా మెచ్చుకుంటారు. ఇక ఆయనలో అసలు కనిపించనివి అసూయా ద్వేషాలు. లేకపోతే తాను ముఖ్యమంత్రి కావాలని ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ఆ తరువాత ఎన్నికల్లో పరాజయం అయినా పెద్దగా పట్టించుకోకుండా తనకు పాలిటిక్స్ సూట్ కావు అనేసుకుని తిరిగి ముఖానికి రంగేసుకుని తన వృత్తి మీద భక్తి ప్రదర్శిస్తున్న వారు.

ఇక తన కంటే వయసులో చిన్న అయినా జగన్ కి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. అందుకే ఆయన సినీ రంగ సమస్యలను సినిమా తల్లి బిడ్డగా వెళ్లి పరిష్కరించారు. మరో వైపు చూస్తే జగన్ కూడా చిరంజీవిని అన్నా అని పిలుస్తారు. మా ఇంటికి ఎపుడైనా భోజనానికి రావచ్చు అంటూ జగన్ చిరుకు సుస్వాగతం పలుకుతారు.

మరో వైపు చూస్తే ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే మాత్రం జగన్ కి ఇష్టం ఉండదు, ఆయన్ని దత్తపుత్రుడు అంటారు. ఈ మధ్య వరసబెట్టి పవన్ మీద జగన్ ప్రతీ సభలోనూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మెగా బ్రదర్స్ విషయంలో జగన్ కానీ వైసీపీ నేతలు కానీ చాలా తేడా చూపిస్తారు.

తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని అయితే చిరంజీవిది ఉన్నత వ్యక్తిత్వం అని కొనియాడారు. ఆయన మంచి వారు అంటూ కితాబు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మనస్తత్వం పూర్తిగా వేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మొతానికి చూస్తే మెగాస్టార్ అంటే చాలా ప్రేమ చూపించే వైసీపీ పెద్దలు పవన్ని మాత్రం ఛాన్స్ దొరికితే చాలు చీల్చిచెండాడుతారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి ఏపీలో పాత సినిమా రేట్లే వర్తించాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. విపక్షాలు సైతం పవన్ మీద కక్ష సాధింపు చర్యలు అని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ కి ఏపీలో టికెట్ల రేట్లు పది రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేశారు.

ఇపుడు మెగాస్టార్ సినిమా ఆచార్యకు కూడా పది రోజుల పాటు ఏపీలో టికెట్లు పెంచుకునేందుకు అనమతి ఇస్తూ జగన్ సర్కార్ ఉదారంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ మావాడు అంటోంది వైసీపీ. అదే సమయంలో పవన్ని మాత్రం దత్తపుత్రుడు అని చంద్రబాబుతో కట్టి చూపిస్తోంది. మరి ఈ తేడా రాజకీయ కళ్లతో చూసే వారికి అర్ధమవుతుంది కానీ మెగా ఫ్యామిలీ అంటే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ కి అర్ధమవుతుందా. ఏది ఏమైనా చిరంజీవ చిరంజీవ అని తలుస్తున్న వైసీపీ పెద్దలకు ఆయన దీవెనలు పరోక్షంగా అయినా ఉంటాయా. ఏమో చూడాలి.