Begin typing your search above and press return to search.

బ్ల‌డ్ బ్యాంక్ లో మెగాస్టార్ సోద‌రికి బాధ్య‌త‌లు

By:  Tupaki Desk   |   12 Oct 2021 7:56 AM GMT
బ్ల‌డ్ బ్యాంక్ లో మెగాస్టార్ సోద‌రికి బాధ్య‌త‌లు
X
రెండు ద‌శాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఐ & బ్లడ్ బ్యాంక్ సేవ‌లు విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల సార‌థ్యంలోనే సువిశాల ప‌రిధిలో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికీ సేవ‌లు అందిస్తున్నారు. ఇటీవ‌లే చిరంజీవి-చ‌ర‌ణ్ కోవిడ్ క‌ష్ట కాలంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను స్థాపించి సేవ‌లు చేశారు.

తాజా స‌మాచారం మేర‌కు.. చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ ఛీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ గా మెగాస్టార్ సోదరి డా.మాధ‌వి రాజుని నియమించారు. ఆ మేర‌కు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ K .చిరంజీవి నుంచి ఆదేశాలు అందాయి. గతంలో ఛీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ గా డా.కె గోవింద‌రెడ్డి ఉండేవారు. ఆయ‌న విర‌మించిన అనంత‌రం డా.మాధ‌వి రాజును ఛీఫ్ ఆఫీస‌ర్ గా ప్రకటించారు .

ఇక పై చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంకుని మరింత ప్రగతి పధంలో నడిపిస్తారని ఆశిస్తూ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది డా.మాధ‌వి రాజుకి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ మేర‌కు బ్ల‌డ్ బ్యాంక్ నుంచి అధికారిక స‌మాచారం అందింది.

మెగాస్టార్ చాలా సంవ‌త్స‌రాలుగా సేవాకార్య‌క్ర‌మాల‌పై పూర్తిగా దృష్టి సారించారు.. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో 1998లోనే తన సేవలకు శ్రీకారం చుట్టారు. ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త ఆ సంక‌ల్పానికి కార‌ణ‌మైంది. ఓ రోగి సకాలంలో రక్తం అందక చనిపోయాడన్న వార్త చ‌దివిన మెగాస్టార్ ని అది ఎంతో కదిలించింది. మన వంతు ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే ఇలాంటి మరణాలు సంభవించవు కదా అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన స్తాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంద‌రినో ఆప‌ద‌లో ఆదుకుంది. ప్రాణాల్ని కాపాడింది. ఇటీవ‌ల ర‌క్త ప్లాస్మా డొనేష‌న్ పైనా చిరంజీవి త‌గు ప్ర‌చారం చేశారు. రోగుల‌కు సాయ‌మందించారు.

క‌రోనా రంగ ప్ర‌వేశం ట్రస్ట్ త‌ర‌పున‌ మ‌రో ఆవిష్క‌ర‌ణ‌కు తెర తీసింది. మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ లో ఊహాతీత‌మైన‌ కరోనా మరణాలు కూడా మెగాస్టార్ ను కదిలించాయి. సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే ఆలోచన నుంచి పుట్టిందే ఆక్సిజన్ బ్యాంక్ స్థాపన ఆలోచన. తన ఆలోచనకు కుమారుడు రామ్ చరణ్ తోనూ పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించి అమ‌లు చేశారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేసి ప‌లువురి ప్రాణాల్ని కాపాడారు.
మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేసిన సంగ‌తి తెలిసిందే.