Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చెప్పిన ఆ నలుగురైదుగురులో నలుగురు మెగా హీరోలే..!

By:  Tupaki Desk   |   21 Sep 2021 5:01 AM GMT
మెగాస్టార్ చెప్పిన ఆ నలుగురైదుగురులో నలుగురు మెగా హీరోలే..!
X
'లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందానికి విషెస్ అందించడంతో పాటు, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పెట్టాలని కోరిన సంగతి తెలిసిందే. చిరు మాట్లాడుతూ.. ''ఈ ప్రీ రిలీజ్‌ వేదికగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా సమస్యలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించారు. కానీ, ఇంత వరకు జీవో రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సభా వేదికగా అడుగుతున్నాను. మీరు కనికరించండి. మా వినతిని ప్రత్యేకంగా తీసుకోండి''

''నలుగురు హీరోలు, నలుగురు డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటున్నారు కదా అని అంతా బాగున్నట్లే అనుకోకండి. ఆ నలుగురైదుగురినే దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. కొందరు బాగున్నంత మాత్రాన పరిశ్రమ మొత్తం పచ్చగా ఉన్నట్లు కాదు. అది కరోనా సమయంలో సుస్పష్టంగా తెలిసొచ్చింది. అందుకే దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి.. మా అభ్యర్థనల్ని మన్నించండి. మేం ఆశగా అడగట్లేదు.. అవసరానికి అడుగుతున్నాం. అది మీరు ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం'' అని అన్నారు.

కరోనా నేపథ్యంలో జనాల మీద ఆర్థిక భారం పడకూడదనే ఉదేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను సవరించిన సంగతి తెలిసిందే. అలానే స్పెషల్ - బెనిఫిట్ షోల ప్రదర్శనను నిరాకరించింది. వీటిపై ఏపీ సీఎంతో భేటీలో టాలీవుడ్ పెద్దలు చర్చించబోతున్నారు. ఈలోపే 'లవ్ స్టోరీ' ఈవెంట్ వేదికగా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ చిరంజీవి ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. అయితే చిరంజీవి రెక్కాడితే గాని డొక్కాడని సినీ కార్మికుల గురించి మాట్లాడటం బాగానే ఉన్నప్పటికీ.. ఆయన ప్రస్తావించిన నలుగురైదుగురు హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారనే సంగతి మర్చిపోయారని కామెంట్స్ వస్తున్నాయి.

మెగా హీరోల్లో చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ భారీగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీ మొత్తంలో మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ వంటి ముగ్గురు హీరోలు మాత్రమే ఆ రేంజ్ పారితోషకం తీసుకుంటున్నారు. అందుకే కరోనా నేపథ్యంలో నిర్మాతలకు అండగా ఉండి సినీ కార్మికులను ఆదుకోవాలని అనుకుంటే మొదట మెగా హీరోలు రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహమ్మారి వైరస్ వల్ల గత రెండేళ్ళలో నిర్మాతలు బాగా నష్టపోయిన మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వారికి సపోర్ట్ గా నిలవాలనుకుంటే బడ్జెట్ కంట్రోల్ మీద దృష్టి పెట్టాలి.

ప్రస్తుతం సినిమా బడ్జెట్ లో సింహభాగం హీరోల రెమ్యూనరేషన్ అనే సంగతి తెలిసిందే. అందుకే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తక్కువ పారితోషికాలు తీసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నిర్మాతలపై భారం తగ్గుతుంది. అంతేకానీ సినిమా టికెట్ రేట్లు పెంచి.. ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుల జేబులకు చిల్లులు వేయాలనుకోవడం ఎంతవరకు సబబనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఏపీ ప్రభుత్వంతో జరగబోయే సినీ పెద్దల మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.