Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మేమ్ ఫేమస్

By:  Tupaki Desk   |   26 May 2023 11:59 PM
మూవీ రివ్యూ : మేమ్ ఫేమస్
X
'మేమ్ ఫేమస్' మూవీ రివ్యూ
నటీనటులు: సుమంత్ ప్రభాస్-మణి ఏగుర్ల-మౌర్య-సార్య-సిరి రాశి-శివ నందన్-మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: కళ్యాణ్ నాయక్
ఛాయాగ్రహణం: శ్యామ్ దూపాటి
నిర్మాతలు: శరత్ చంద్ర-అనురాగ్ రెడ్డి-చంద్రు మనోహర్
రచన-దర్శకత్వం: సుమంత్ ప్రభాస్

ఈ మధ్య వెరైటీ ప్రమోషన్లతో యువ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచిన చిన్న సినిమా.. మేమ్ ఫేమస్. 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ఆకట్టుకున్న ఛాయ్ బిస్కెట్ సంస్థ ఈ చిత్రాన్ని యూట్యూబ్ షార్ట్స్ తో ఫేమస్ అయిన సుమంత్ అశ్విన్ తనే హీరోగా రూపొందించడం విశేషం. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

మాయి (సుమంత్ ప్రభాస్).. బాలి (మౌర్య).. దుర్గ (మణి ఏగుర్ల).. బండనర్సింపల్లి అనే తెలంగాణ పల్లెటూరిలో చిన్నపట్నుంచి స్నేహితులు. సరిగ్గా చదువుకోని ఈ ముగ్గురూ.. 20 ఏళ్లు దాటినా ఏ పనీ లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగేస్తుంటారు. రోజూ తాగడం.. గొడవలు పెట్టుకుని పంచాయితీలు తేవడం.. ఇదే పనిగా ఉన్న ఈ స్నేహితుల్లో.. ఒక సంఘటన తర్వాత మార్పు వస్తుంది. జీవితంలో స్థిరపడేందుకు ఏదో ఒకటి చేయాలని ఊర్లో టెంట్ హౌస్ పెడతారు. అది బాగానే నడుస్తూ ఈ ముగ్గురు మిత్రుల జీవితాలు గాడిన పడ్డాయి అనుకుంటుండగా.. అనూహ్య పరిణామాలు జరుగుతాయి. ఈ పరిణామాలు ఏంటి.. తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక.. ఇక్కడి నేటివిటీని హైలైట్ చేస్తూ వినోదాన్ని.. ఎమోషన్లను పండించే కథలకు వెండితెరపై గిరాకీ పెరిగింది. ఈ కథలను యువ దర్శకులు తెలంగాణ అనే కాకుండా తెలుగు వాళ్లందరికీ రుచించేలా తీర్చిదిద్దుతుండటం విశేషం. జాతిరత్నాలు.. బలగం లాంటి సినిమాలను ప్రాంతీయ భేదం లేకుండా అందరూ చూశారు. 'జాతిరత్నాలు' సినిమా నవ్వుల్లో ముంచెత్తితే.. 'బలగం' ఎమోషన్లలో తడిసి ముద్దయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ సినిమాల స్ఫూర్తితోనే సుమంత్ ప్రభాస్ అనే కుర్రాడు.. 'మేమ్ ఫేమస్' అంటూ వచ్చాడు. 'బలగం' తరహాలో పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో ఒక కథను అల్లుకుని 'జాతిరత్నాలు' తరహాలో లైట్ హార్టెడ్ స్టయిల్లో వినోదాన్ని పండించడానికి ప్రయత్నించాడు. అతను వేరే సినిమాలను అనుకరించే ప్రయత్నం చేసినా.. ఇందులోనూ ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నం కనిపిస్తుంది. కాకపోతే ట్రైలర్ చూస్తే.. ఇదొక రేసీ ఎంటర్టైనర్ అని ఆశించిన వారికి నిరాశ తప్పదు. ఇందులో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడా వినోదం పండింది. కానీ స్లో నరేషన్.. ఎగుడు దిగుడుగా సాగే కథనం సినిమాను కిందికి లాగాయి. ఓవరాల్ గా చూస్తే 'మేమ్ ఫేమస్' షార్ట్ ఫిలింకి ఎక్కువ.. ఫీచర్ ఫిలింకి తక్కువ అన్న ఫీలింగ్ కలుగుతుంది.

'మేమ్ ఫేమస్' సినిమాకు ట్రైలర్ అనేది ప్లస్సే కాదు.. మైనస్ కూడా. ఆ ట్రైలర్ చూసి ఇది రయ్యిన దూసుకెళ్లే ఎంటర్టైనర్ అనుకుంటాం. సినిమా మీద అంచనాలు పెంచడానికి ట్రైలర్ ఉపయోగపడింది కానీ.. ఆ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. 23 ఏళ్ల వయసులోనే హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా చేసిన సుమంత్ ప్రభాస్.. రైటర్ గా.. డైరెక్టర్ గా కొన్ని చోట్ల ప్రతిభను చాటుకున్నాడు కానీ.. తన నరేషన్లో మాత్రం వేగం లేదు. ఆ వేగమే ఉంటే.. ఈ సినిమా 'జాతిరత్నాలు-2' అయ్యేదేమో. నిజానికి కథ.. పాత్రలు.. అనేక సన్నివేశాలు 'జాతిరత్నాలు' సినిమాను పదే పదే గుర్తుకు తెస్తాయి. అందులో మాదిరే ఇక్కడా ముగ్గురు హీరోలు. ఆ ముగ్గురూ ఒకర్ని మించిన జులాయి ఒకరు. ఊర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. తాగి తందనాలాడుతూ.. అందరితో తిట్టించుకుంటూ.. పంచాయితీలు తెచ్చిపెడుతూ బతికేస్తుంటారు. కాకపోతే 'జాతిరత్నాలు' పూర్తిగా కామెడీ లక్ష్యంతోనే ఆరంభం నుంచి చివరిదాకా అల్లరిగానే సాగిపోతే.. ఇక్కడ ఒక దశ వరకే ఆ అల్లరి నడుస్తుంది. ఆ తర్వాత బాధ్యతలు.. లక్ష్యాలు అంటూ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.

ముగ్గురు కుర్రాళ్ల అల్లరితో ఉన్నంతలో బాగానే నవ్వించగలిగాడు రైటర్ కమ్ డైరెక్టర్ సుమంత్. అతను ఎక్కువ కష్టపడకుండా ఊర్లల్లో సగటు కుర్రాళ్ల జీవితాల్లో జరిగే విషయాలనే సన్నివేశాలుగా మార్చాడు. బెట్ మ్యాచ్ ఆడటం.. పెళ్లి బారాత్ లో డ్యాన్సులు చేయడం.. మందు కొడుతూ కనిపించిన కోడిని చంపి స్టఫ్ చేసుకోవడం.. ఇలా ప్రతిదాంతోనూ ఒక గొడవ.. ఒక పంచాయితీ.. ఇలా సాగిపోతాయి సన్నివేశాలు. ఒక దశ తర్వాత గొడవలు.. పంచాయితీలు ముదిరిపోయి జీవితంలో స్థిరపడటం కోసం ఈ కుర్రాళ్లు చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ ముందుకు నడుస్తుంది. ఐతే ప్రథమార్ధం వరకు ఒక మోస్తరు వినోదంతో బాగానే సాగిపోయే 'మేమ్ ఫేమస్'.. రెండో అర్ధంలో మాత్రం గాడి తప్పిన భావన కలుగుతుంది. అప్పటికే నెమ్మదిగా సాగుతున్న సినిమా.. సెకండాఫ్ లో మరీ స్లో.. డల్ అయిపోతుంది. యూట్యూబ్ వీడియోలతో హీరో అండ్ కో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించే ఎపిసోడ్ల కోసం చాలా సమయం పెట్టేశారు. సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపిస్తూ.. కథాకథనాలు పెద్దగా ముందుకు కదలకపోవడంతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. పతాక సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. ఐతే ట్రెండీగా అనిపించే కొన్ని సీన్లు.. జోకులు.. అంజిమామ.. లిప్ స్టిక్ స్పాయిలర్ లాంటి పాత్రలు వీలైనంత మేర ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. 'మేమ్ ఫేమస్' ఒక హానెస్ట్ అటెంప్ట్ అనడంలో సందేహం లేదు. మరీ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ వినోదం కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు.


సాంకేతిక వర్గం:

'మేమ్ ఫేమస్' టెక్నికల్ గా ఓకే అనిపిస్తుంది. కళ్యాణ్ నాయక్ పాటలు బాగున్నాయి. చార్ట్ బస్టర్ అనిపించే పాటలు లేకపోవడం మైనస్సే అయినా.. తెర మీద పాటలైతే బోర్ కొట్టించవు. తెలంగాణ పల్లెల నేటివిటీని సాహిత్య.. దృశ్య పరంగా బాగానే చూపించారు. నేపథ్య సంగీతం ఓకే. శ్యామ్ దూపాటి విజువల్స్ బాగున్నాయి. సినిమాను పరిమిత బడ్జెట్లో తీసిన విషయం తెరపై కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్ అధినేతలు.. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ అలాంటి సినిమానే తీసే ప్రయత్నం చేశారు. వయసు.. అనుభవం చూడకుండా సుమంత్ ప్రభాస్ తో సినిమా తీయించడం అభినందనీయమే. కానీ ఇంకొంచెం ఇంటెన్సిటీ.. వైవిధ్యం ఉన్న కథను ఎంచుకోవాల్సింది. సినిమా లెవెల్ పెంచేందుకు ప్రయత్నించాల్సింది. సుమంత్ ప్రభాస్ లో ప్రతిభ ఉంది. ఒక ఫీచర్ ఫిలిం తీసేందుకు ఆ ప్రతిభ.. తన అనుభవం సరిపోలేదనిపిస్తుంది. కథాకథనాల విషయంలో అతను ఇంకాస్త కసరత్తు చేయాల్సింది.

చివరగా: మేమ్ ఫేమస్.. ఒక మోస్తరుగా

రేటింగ్-2.5/5