Begin typing your search above and press return to search.

మెంటల్ పోలీస్.. తగ్గట్లేదుగా

By:  Tupaki Desk   |   28 April 2016 3:30 PM GMT
మెంటల్ పోలీస్.. తగ్గట్లేదుగా
X
మెంటల్ పోలీస్ అనే టైటిల్ పెట్టడం వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ పోలీసు వర్గాలు హైకోర్టును ఆశ్రయించడం.. ఆ టైటిల్ మారిస్తే తప్ప సినిమాను విడదుల చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిన సంగతే. ఐతే ‘మెంటల్ పోలీస్’ టీమ్ మాత్రం టైటిల్ మార్చే విషయంలో సుముఖంగా ఉన్నట్లుగా లేదు. ఈ రోజు అదే టైటిల్‌తో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. అందులో మెంటల్ పోలీస్ అనే పదాన్ని విరివిగా వాడారు. ట్రైలర్లో ఓ చోట శ్రీకాంత్.. ‘‘అవును నేను మెంటల్ పోలీసే.. మెంటల్ పోలీసే’’ అని డైలాగ్ కూడా చెప్పాడు. ఇది వింటుంటే.. టైటిల్ మార్చమన్న డిమాండుని పట్టించుకోం.. ఈ టైటిలే కొనసాగిస్తాం అని నొక్కి వక్కాణించినట్లుగా ఉంది.

ఇక ట్రైలర్లోని మిగతా విశేషాలు చూస్తే.. అనగనగా ఓ పోలీస్.. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అన్యాయాన్ని అస్సలు సహించడు. అవతలి వాడు ఎంత వాడైనా వెనక్కి తగ్గడు. ముందు అందరూ అతణ్ని అపార్థం చేసుకున్నా.. తర్వాత అతడేంటో అర్థమవుతుంది. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన తర్వాత శ్రీకాంత్ నటించిన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ ఇదని నరేషన్ కూడా ఇచ్చారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాను తలపించే సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులోని విలన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. కోట శ్రీనివాసరావు మెయిన్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌కు అసలు హీరోయినే లేకపోవడం విశేషం. మరి టైటిల్ వివాదాన్ని పరిష్కరించుకుని ఈ సినిమా సజావుగా విడుదలవుతుందో లేదో చూడాలి.