Begin typing your search above and press return to search.

‘మెర్శల్’ కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 Oct 2017 10:08 AM GMT
‘మెర్శల్’ కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు
X
గత వారం దీపావళి కానుకగా విడుదలైన తమిళ సినిమా ‘మెర్శల్’ కలెక్షన్ల గురించి వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.178 కోట్లు వసూలు చేసిందని.. ఇప్పటికే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసి ‘రోబో’ పేరిట ఉన్న తమిళ సినిమా కలెక్షన్ల రికార్డును దాటేసే దిశగా దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఐతే ఈ వసూళ్ల విషయమై చెన్నైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవి ఫేక్ కలెక్షన్లని.. కావాలనే వసూళ్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారని అతనన్నాడు. చెన్నైలో పేరుమోసిన ‘అభిరామి’ మల్టీప్లెక్స్ అధినేత కూడా అయిన రామనాథన్ వ్యాఖ్యానించినట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికలో వచ్చిన వార్తల సంచలనం రేపుతోంది.

1976 నుంచి తాను సినీ రంగంలో ఉన్నానని.. గతంలో తాము టికెట్ల రేట్లు పెంచి బ్లాక్‌లో అమ్మడం ద్వారా సినిమా గొప్పగా ఆడేస్తున్నట్లు జనాల్లో భ్రమలు కల్పించేవాళ్లమని.. ఇప్పుడు వసూళ్లు కూడా అలాగే పెంచి చూపిస్తూ కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందని రామనాథన్ అన్నాడు. 200 కోట్ల వసూళ్లు అనగానే ఇలాంటి సినిమాను మిస్ కాకూడదన్న భావన జనాల్లో కలుగుతుందని.. అందుకే వసూళ్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారని రామనాథన్ అభిప్రాయపడ్డాడు. ఒక సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు నిర్మాతలకు అసలు వసూళ్లు ఎంత అనే విషయం తెలియదని అతను స్పష్టం చేశాడు.