Begin typing your search above and press return to search.

చిన్మ‌యిపై పెద్దాయ‌న కుట్ర‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 7:34 PM GMT
చిన్మ‌యిపై పెద్దాయ‌న కుట్ర‌
X
మీటూ ఉద్య‌మం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ కు పాకిన ఈ వివాదం ఇటీవ‌ల ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్ని ఓ ఊపు ఊపింది. ద‌క్షిణాదిలో ప‌లువురు ప్ర‌ముఖుల‌పై గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద గ‌ళం విప్పి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత వైర‌ముత్తు - త‌మిళ డ‌బ్బింగ్ యూనియ‌న్ ప్రెసిడెంట్ రాధార‌వి పైనే ఆరోప‌ణ‌లు చేసి త‌మిళ చిత్ర సీమ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసిన విష‌యం తెలిసిందే.

దీంతో క‌క్ష‌గ‌ట్టిన న‌టుడు రాధార‌వి తెలివిగా చిన్మ‌యి శ్రీ‌పాద‌ను త‌మిళ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ నుంచి తొల‌గించిన‌ట్లు చెబుతున్నారు. దీనిపై చిన్మ‌యి వివ‌ర‌ణ కోర‌గా గ‌త రెండేళ్లుగా స‌భ్య‌త్వ రుసుము చెల్లించ‌లేద‌ని, ఆ కార‌ణంగానే చిన్మ‌యిని యూనియ‌న్ నుంచి తొల‌గించామ‌ని చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ వివాదంపై చిన్మ‌యి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. రెండేళ్లు స‌భ్య‌త్వ రుసుం చెల్లించ‌క‌పోతే ఇంత కాలం ఎందుకు కొన‌సాగించార‌ని, త‌న డ‌బ్బింగ్ ఫీజులో 10 శాతం ఎందుకు కోత విధించార‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. త‌న‌కు ఈ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ముందే ఊహించాన‌ని చిన్మ‌యి అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. దీనికి యూనియ‌న్ స‌భ్య‌ల నుంచి ఎలాంటి స‌మాధానం లేక‌పోవ‌డం విశేషం.

మీటూ పేరుతో ర‌చ్చ చేసిన‌ క‌థానాయిక‌ల ప‌రిస్థితి దాదాపు ఇలానే ఉంది. ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డి, మాధ‌వీల‌త లాంటి నాయిక‌ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌లేదెవ‌రూ. అటు కోలీవుడ్‌ లో సుచీలీక్స్ సుచిత్ర (గాయ‌ని) ఏమైందో ఎవ‌రికీ తెలీదు. ఇటీవ‌ల చిన్మ‌యి శ్రీ‌పాద బ‌య‌ట‌ప‌డింది కాబ‌ట్టి కెరీర్ ప‌రంగా మునుముందు గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇక బాలీవుడ్‌లో నానా ప‌టేక‌ర్‌ పై ఆరోపించి కోర్టు గొడ‌వ‌ల్లో ఉన్న త‌నూశ్రీ ద‌త్తాకు మునుముందు అవ‌కాశాలు ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇది వింత ప్ర‌పంచం.. మాయావ‌నం. ఇక్క‌డ ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగ‌తి అని తాజా స‌న్నివేశం చెబుతోంది.