Begin typing your search above and press return to search.

ఆ పాట‌ను కంపోజ్ చేయ‌డం ఓ ఛాలెంజ్‌

By:  Tupaki Desk   |   13 Dec 2021 3:30 PM GMT
ఆ పాట‌ను కంపోజ్ చేయ‌డం ఓ ఛాలెంజ్‌
X
అత‌నో యంగ్ సంగీత త‌రంగం.. హ్యాపీడేస్ లాంటి యూత్ సినిమాకీ సంగీతాన్ని అందించ‌గ‌ల‌డు.. దాన్ని మ‌రిపిస్తూ `మ‌హాన‌టి` వంటి సినిమాకూ సంగీతం చేయ‌గ‌ల‌డు. పిరియాడిక్ ఫాంట‌సీ డ్రామా కూ స్వ‌రాలు అందించ‌గ‌ల‌డు.. అత‌నే మిక్కీ జె. మేయ‌ర్‌. ఆయ‌న సంగీతం అందిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ బోయినప‌ల్లి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మిక్కీ జె. మేయ‌ర్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని వెల్ల‌డించారు.

టు టైమ్ పీరియ‌డ్స్ కు సంబంధించిన క‌థ `శ్యామ్ సింగ రాయ్‌`. గ‌తం , వ‌ర్త‌మానం అంటూ రెండు బాగాల్లో జ‌రుగుతుంది. 70వ ద‌శ‌కంలోని వాతావ‌ర‌ణాన్నిఇందులో చూపించ‌నున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే సంగీతాన్ని అందించాను. నాకు ఇండియ‌న్ ఇన్‌స్ట్రూమెంట్స్ పై మంచి ప‌ట్టుంది. కాబ‌ట్టి ఆ కాలంలో ఉప‌యోగించిన వాయిద్యాల‌నే ఇందులో ఎక్కువ‌గా ఉప‌యోగించాం,త‌బ‌ల‌, సితార్‌, సంతూర్ వంటి వాయిద్యాల‌ని వాడి సంగీతాన్ని అందించాం.

శ్యామ్ సింగ రామ్ లో నార్త్‌, సౌత్ ఫ్లేవ‌ర్ క‌లిసి ఓ కొత్త ఫ్లేవ‌ర్ వుంటుంది. కోల్‌క‌తా నేప‌థ్యంలో సినిమా సాగుతుంది కాబ‌ట్టి బెంగాళీ సంగీతాన్ని వాడాను. టాలీవుడ్ లో ఇలాంటి నేప‌థ్యంలో రాబోతున్న మొట్ట‌మొద‌టి సినిమా ఇదే. ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్ క‌థ చెప్ప‌గానే చాలా ఎగ్జైట్ ఫీల‌య్యా.. కార‌ణం ఏంటంటే ఇలాంటి క‌థ‌కు సంగీతం అందించే స్కోప్ వుంటుంది. అంతే కాకుండా నేప‌థ్య సంగీతానికి కూడా మంచి అవ‌కాశం వుంది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. సినిమా రిలీజ అయ్యాక నేప‌థ్య సంగీతానికి మ‌రింత పేరొస్తుంది.

సిరివెన్నెల లాంటి లెజెండ్ తో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం నిజంగా నా అదృష్టం. ఆయ‌న‌తో గ‌డిపిన ప్ర‌తీ మూవ్ మెంట్ నాకు మ‌ర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాకు ఆయ‌న రెండు పాట‌లు రాశారు. ఓపాట‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశాం. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. మ‌రో పాట‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్నాం. ఆ పాట‌లో సిరివెన్నెల గారి సాహిత్యం అద్భుతంగా వుంటుంది. దాన్ని కంపోజ్ చేయ‌డం ఛాలెంజింగ్ గా అనిపించింది.

ఓ పాట ని ఏ సింగ‌ర్ తో పాడించాల‌నే విష‌యంలో హీరో, ద‌ర్శ‌కుల స‌ల‌హాలు తీసుకుంటాను. కానీ తుది నిర్ణ‌యం మాత్రం నాదే వుంటుంది. ఎందుకంటే పాట కంపోజ్ చేస్తున్న‌ప్పుడే దీన్ని ఎవ‌రు పాడితే బాగుంటుంద‌న్న‌ది నిర్ణ‌యించుకుంటాను. ఈ సినిమా మ్యూజిక్‌, నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. ప్ర‌స్తుతం నందిని రెడ్డి, స్వ‌ప్నాద‌త్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీ‌వాస్ , గోపీచంద్ ప్రాజెక్ట్ వుంది. దిల్ రాజు సంస్థ‌లో మ‌రో సినిమాకు సంగీతం చేస్తున్నాను. సినిమాల‌తో పాటు ఇంగ్లీష్ , స్పానిష్ భాష‌ల్లో ప్రైవేట్ ఆల్బ‌మ్స్ చేస్తున్నాను.. అన్నారు మిక్కీ జే మేయ‌ర్‌.