Begin typing your search above and press return to search.

హ్యాపీ డేస్.. ఇదేం సినిమా అనుకున్నాడట

By:  Tupaki Desk   |   6 April 2017 5:30 PM GMT
హ్యాపీ డేస్.. ఇదేం సినిమా అనుకున్నాడట
X
దశాబ్దం కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ‘హ్యాపీ డేస్’. అందరూ కొత్త వాళ్లతో శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. అప్పట్లోనే రూ.30 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్‌ గా నిలిచింది. ఐతే ‘హ్యాపీ డేస్’కు తన సంగీతంతో బ్యాక్ బోన్ లాగా నిలిచిన మిక్కీ జే మేయర్.. రీరికార్డింగ్ కోసం ఈ చిత్రాన్ని చూసినపుడు ఇదేం సినిమా అనుకున్నాడట. తన అంచనా తప్పని సినిమా రిలీజయ్యాకే తెలిసిందని అంటున్నాడు మిక్కీ. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన ‘శతమానం భవతి’ సినిమా విషయంలోనూ ఇలాగే తన అంచనా తప్పని తేలినట్లు మిక్కీ వెల్లడించాడు.

‘‘ఓ సినిమాకు సంగీతాన్నందించే సమయంలో స‌క్సెస్ ఫెయిల్యూర్లను నేను అంచ‌నా వేయ‌లేను. ఎందుకంటే నాకు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమా నచ్చలేదు. ఆ సినిమాకు మ్యూజిక్ చేసే స‌మ‌యంలో ఇదేంటి.. ఇలా ఉంది అనుకున్నాను. కానీ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ మధ్య వచ్చిన ‘శ‌త‌మానం భ‌వ‌తి’ విషయంలోనూ నా అంచనా తప్పింది. ఆ సినిమా విడుద‌లైన త‌ర్వాత దిల్‌ రాజు గారికి ఫోన్ చేసి సారీ అని చెప్పాను’’ అని మిక్కీ తెలిపాడు.

‘హ్యాపీ డేస్’.. ‘కొత్త బంగారు లోకం’ లాంటి పెద్ద మ్యూజికల్ హిట్లిచ్చాక తన కెరీర్లో పెద్ద గ్యాప్ రావడం గురించి మిక్కీ స్పందిస్తూ.. ‘‘కొత్త బంగారు లోకం త‌ర్వాత మా నాన్న‌గారికి ఆరోగ్యం బాగ‌లేక‌పోయింది. ఆ స‌మ‌యంలో నేను ఆయ‌న‌తోనే ఉన్నాను. తర్వాత ఆయన చనిపోయారు. బాగా డిస్టర్బ్ అయ్యాను. అందుకే కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చింది. పైగా నేను కొత్తలో ఇండస్ట్రీ వాళ్లతో అంతగా కలిసేవాడిని కాదు. అందుకు ముఖ్య కార‌ణం నాకు తెలుగు మీద అప్ప‌ట్లో ప‌ట్టు లేక‌పోవ‌డం. అది కాకుండా నేను పెద్ద‌గా ఎవ‌రినీ క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డను. నాకు ఫిలిం ఇండ‌స్ట్రీ వేరే లోకంలా క‌న‌ప‌డింది. నాకు నేనే చిన్న‌వాడిని అనుకుంటాను. త‌ర్వాత నెమ్మ‌దిగా ఇక్క‌డ అల‌వాటు ప‌డ్డాను. ఇప్పుడు పర్వాలేదు’’ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/