Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ 'కెప్టెన్'

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:32 AM GMT
మినీ రివ్యూ కెప్టెన్
X
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోలలో ఆర్య ఒకరు. చివరగా ఓటీటీలో 'సార్పట్టా' సినిమాతో అలరించిన వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు "కెప్టెన్" అనే చిత్రంతో వచ్చాడు. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి - సిమ్రాన్ - హరీష్ ఉత్తమన్ - కావ్య శెట్టి - మాళవికా అవినాష్ - ఆదిత్యా మీనన్ - సురేష్ మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ప్రమోషనల్ కంటెంట్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా అనేలా అందరి దృష్టిని ఆకర్షించిన 'కెప్టెన్' సినిమా ఈరోజు (సెప్టెంబర్ 8) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

ఓ వింత జీవితో పోరాటం చేయడమే 'కెప్టెన్' సినిమా కథ అని ప్రచార కార్యక్రమాల్లో ఆర్య చెబుతూ వచ్చాడు. కెప్టెన్ మరియు అతని బృందం ఆ వింత జీవితో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఆ వింత జీవి వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం ఉంది? అనేదే ఈ సినిమా కథ అని తెలిపాడు. ఈ మాటలు విని ఇదేదో కొత్త కాన్సెప్ట్ తో తీసిన సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకొని ఈరోజు థియేటర్ లో చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని టాక్ ని బట్టి తెలుస్తోంది.

కథ విషయానికొస్తే.. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) ఆధ్వర్యంలో నడిచే స్పెషల్ టీమ్.. ఓ డేంజరస్ ఆపరేషన్ కు పూనుకుంటుంది. చాలా ఏళ్లుగా పౌర కార్యకలాపాలు లేదా సైనిక కార్యకలాపాలు లేని భారతదేశంలోని ఈశాన్య అటవీ ప్రాంతం వెనకున్న రహస్యాన్ని ఛేదించే బాధ్యత తీసుకుంటుంది. అక్కడకి వెళ్లినవారు తిరిగిరాకపోవడానికి కారణం ఓ వింత జీవి అని తెలుసుకుంటారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ జీవిని ఎలా ఎదుర్కొన్నారు? అవి భూమి మీదకు ఎలా వచ్చాయి? చివరకు వాటిని అంతమొందించారా లేదా? అనేది తెలియాలంటే 'కెప్టెన్' సినిమా చూడాల్సిందే.

కథ వింటుంటేనే ఏలియన్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో తెరకెక్కిన అనేక ఇంగ్లీష్ సినిమాలు గుర్తుకు వస్తాయి. 'కెప్టెన్' ట్రైలర్ చూసినప్పుడే.. ఆర్నాల్ నటించిన 'ప్రెడేటర్' సినిమా స్పూర్తితో తీసారేమో అనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులకు అదే నిజమనిపిస్తుంది. ఇలాంటి కథ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో నడిపించాల్సి ఉంటుంది. ఆ విషయంలో కెప్టెన్ దర్శకుడు విఫలమయ్యాడని తెలుస్తోంది.

స్టోరీ లైన్ బాగానే అనిపించినప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా దారి తప్పాడు. రొటీన్ సీన్స్ తో ఏమాత్రం ఎగ్జైట్ మెంట్ లేకుండా పేలవమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించాడు. డైరెక్టర్ కు గ్రాఫిక్స్ మీద మంచి పట్టు ఉంది.. అందుకే కెప్టెన్ సినిమా ఒప్పుకున్నానని ఆర్య ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పాడు. శక్తి సౌందర్ రాజన్ డైరెక్ట్ చేసిన 'టిక్ టిక్ టిక్' 'టెడ్డీ'సినిమాల చూస్తే ఆర్య చెప్పిన దాంతో ఏకీభవించవచ్చు. కానీ ఇక్కడ గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ సినిమాకు ప్రధాన మైనస్ గా మారాయి.

ఇటీవల కాలంలో వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రేక్షకులు చాలా మెచ్యూర్ గా ఉన్నారు. అందుకే మేకర్స్ దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టి టాప్ క్లాష్ గ్రాఫిక్స్ అందించడానికి ట్రై చేస్తున్నారు. కానీ 'కెప్టెన్' సినిమాలో ప్రతీ షాట్ చాలా దారుణంగా ఉందని అంటున్నారు. అవుట్ డేటెడ్ సీజీ వర్క్ అని తేల్చేశారు. ఇక లాగిక్స్ సంగతి సరే సరి. కథలో కీలకమైన వింత జీవిని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ.. దాన్ని తెర మీద మాత్రం సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. వీక్ విలన్ లేదా ఏలియన్ అని చెప్పాలి.

కొన్ని సన్నివేశాలని నీటిలో 20 అడుగుల లోపు.. కొన్నింటిని భూమికి 100 అడుగులపైన షూట్ చేశామని మేకర్స్ తెలిపారు. వింత జీవి అనేది గ్రాఫిక్స్ కాబట్టి.. అక్కడ ఏలియన్ ఉందనుకొని సరైన ఎస్ప్రెసన్స్ తో నటించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆర్య ని మెచ్చుకొని తీరాల్సిందే. ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించడానికి బాగానే కష్టపడ్డాడు. కాకపోతే రైటింగ్ వీక్ గా ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు.

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కేవలం రెండు సీన్లు మరియు ఒక మాంటేజ్ సాంగ్ కే పరిమితమైంది. తక్కువ సన్నివేశాల్లో కనిపించినా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. డి. ఇమ్మాన్ సమకూర్చిన బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. కాకపోతే దానికి తగ్గట్టుగా సీజీ లేకపోవడం మైనస్ గా మారింది. నిర్మాణ విలువలు ఇలాంటి జోనర్ సినిమాలకు తగ్గట్టుగా లేవు. మొత్తం మీద డిఫరెంట్ ఐటెంప్టే కానీ.. దురదృష్టవశాత్తు ఇది వర్కౌట్ కాలేదు. దీంతో తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్ళు రాబడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.