Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : గుడ్ ల‌క్‌ జెర్రీ

By:  Tupaki Desk   |   2 Aug 2022 3:33 PM GMT
మినీ రివ్యూ : గుడ్ ల‌క్‌ జెర్రీ
X
న‌టిగా ప్రూవ్ చేసుకోవాల‌ని, త‌ద్వారా త‌ల్లి శ్రీ‌దేవి త‌ర‌హాలో భారీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని, క్రేజ్ ని సొంతం చేసుకోవాల‌ని జాన్వీక‌పూర్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ప్ర‌తీ ప్ర‌య‌త్నం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కావ‌డం లేదు. అయినా స‌రే కొత్త క‌థ‌ల్లో.. పాత్ర‌ల్లో మెప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన త‌మిళ చిత్రం `కొల‌మావు కోకిల‌`. 2018లో న‌య‌న‌తార న‌టించిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా ఆధారంగా `గుడ్ ల‌క్ జెర్రీ` ని హింద‌లో రీమేక్ చేశారు. ఇందులో జాన్వీ టైటిల్ పాత్ర‌లో న‌టించింది. డ్ర‌గ్స్ దందా నేప‌థ్యంలో సాగే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.

న‌టీన‌టులు జాన్వీక‌పూర్ - స‌మ‌తా సుదీక్ష - మితా వ‌శిష్ట్ - నీర‌జ్ సూద్ -సుశాంత్ సింగ్ త‌దిత‌రులు న‌టించారు.

ద‌ర్శ‌క‌త్వం సిద్దార్ధ్ సేన్ - ర‌చ‌న: పంక‌జ్ మ‌ట్టా - నిర్మాత సుభాస్క‌ర‌న్ అల్లిరాజా - ఆనంద్ ఎల్ రాయ్ - మ‌హావీర్ జైన్ - సినిమాటోగ్ర‌ఫీ :ర‌ంగ‌రాజ‌న్ రాభ‌ద్ర‌న్ - ఎడిటింగ్ : ప్ర‌కాష్ చంద్ర సాహూ - జుబిన్ షేక్ మ్యూజిక్ : అమిత్ పంత్ - ప‌రాగ్ చ‌బ్రా బ్యాన‌ర్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ - మ‌హావీర్ ఫిలింస్. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో జూలై 290 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

క‌థ: జ‌యా కుమారి అలియాస్ జెర్రీ (జాన్వీ క‌పూర్‌) మ‌ధ్యత‌ర‌గ‌తి అమ్మాయి. తండ్రి చ‌నిపోవ‌డంతో కుటుంబ భారాన్ని త‌న భుజాల‌పై వేసుకుంటుంది. మ‌సాజ్ సెంట‌ర్ లో ప‌ని చేస్తూ త‌ల్లి (మితా వ‌శిష్ట్) - చెల్లి (స‌మ‌తా సుదీక్ష)లను పోశిస్తూ వుంటుంది. ఎంతో స‌ర‌దాగా సాగిపోతున్న ఈ కుటుంబానికి ఊహించ‌ని స‌మ‌స్య ఎదుర‌వుతుంది. జెర్రీ త‌ల్లి ఊప‌రితిత్తుల క్యాన్స‌ర్ బారిన ప‌డుతుంది. ఇందుకు ఆమె చికిత్స కోసం రూ. 25 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని వైద్యులు చెప్ప‌డంతో ఆ మొత్తాన్ని సంపాదించ‌డానికి జెర్రీ నానా ప్ర‌య‌త్నాలు ప‌డుతుంది. ఈ క్ర‌మంలో త‌న ప్ర‌మేయం లేకుండానే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేముఠా చేతుల్లో చిక్కుకుంటుంది. ఆరంతా ఎందుకు జెర్రీని టార్గెట్ చేశారు?. ఆ చీక‌టి వ్యాపారం నుంచి జెర్రీ ఎలా త‌ప్పించుకుంది? ..త‌న త‌ల్లికి ఆప‌రేష‌న్ చేయించిందా? అన్న‌దే అస‌లు క‌థ‌.

న‌య‌న‌తార చేసిన సినిమాకు రీమేక్ కావ‌డం.. ఇప్ప‌టికే ఆ మూవీని చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఓటీటీల్లో చాలా మంది చూసి వుండ‌టంతో అంతా ఆ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఆ స్థాయి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పైగా సినిమా పంజాబ్ నేప‌థ్యంలో సాగుతుంది. హిందీ నేటివిటీకి అనుగునంగా కొన్ని మార్పులు చేశారు. అయితే పంజాబ్ నేప‌థ్యం కావ‌డంతో హిందీ కొంచెం డిఫ‌రెంట్ గా వుంటుంది. అది కొంత మందికి డైజెస్ట్ కాలేక‌పోయింది. అంతే కాకుండా మేకింగ్ విష‌యంలోనూ పెద్ద‌గా మేక‌ర్స్ ఖ‌ర్చు చేసిన‌ట్టుగా క‌నిపించ‌దు. మేకింగ్ ప్ర‌ధాన మైన‌స్ గా నిలిచింద‌ని చెప్పొచ్చు. జాన్వీక‌పూర్ త‌ప్ప మ‌రో న‌టుడు తెలిసిన వారు లేక‌పోవ‌డం మ‌రింత డ్రా బ్యాక్ గా మారింది.

ఇక ఈ మూవీని కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించాల‌ని ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన జాన్వీ క‌పూర్ ఉన్నంత వ‌ర‌కు బాగానే న‌టించింది. కానీ మాతృక‌లోని న‌య‌న‌తార‌ని మాత్రం మ‌రిపించ‌లేక‌పోయింది. చాలా స‌న్నివేశాల్లో త‌నదైన ఈజ్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే త‌న బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టుగా జెర్రీ పాత్ర‌ని మ‌ల‌చ‌డంతో మాత్రం ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు.

ఇక సెకండ్ హాఫ్ లో ఎమోష‌న్స్ ని పండించాల‌ని చూసిన డ్ర‌గ్స్ గంద‌ర‌గోళంలో జెర్రీ పాత్ర ప్ర‌ధాన ఉద్దేశం త‌ప్పుదారి ప‌ట్టిన‌ట్టుగా క‌నిపిస్తుంది. యాక్ష‌న్‌, మెలో డ్రామాకు స్కోప్ వున్నా జాన్వీని పాత్ర‌ని మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. మ‌రింత‌గా జెర్రీ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించే వీలున్నా ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయాడు. పేరున్న న‌టీన‌టుల‌ని తీసుకుని వుంటే మ‌రింత ఇంపాక్ట్ ప‌డేది కానీ ఆ విష‌యంలోనూ నిరుత్సాహ‌మే ఎదురైంది.

ఓవ‌రాల్ గా `గుడ్ ల‌క్ జెర్రీ` యావ‌రేజ్ మూవీగా కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది. హ‌రీ బ‌రీగా చూడాల్సిన సినిమా కాక‌పోయినా జాన్వీక‌పూర్ కోసం చూడాల‌నుకునే ఫ్యాన్స్ ఒక్క‌సారి చూడొచ్చు. రీమేక్ మూవీ అయినా త‌న కెరీర్ ని మారుస్తుంద‌ని ఆశ‌ప‌డిన జాన్వీకి `గుడ్ ల‌క్ జెర్రీ` మ‌రోసారి తీవ్ర నిరాశ‌నే మిగిల్చిందని చెప్పొచ్చు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ మూవీ జూలై 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.