Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'సూర్యవంశీ'

By:  Tupaki Desk   |   6 Nov 2021 3:55 AM GMT
మినీ రివ్యూ: సూర్యవంశీ
X
బాలీవుడ్ స్టార్స్ అక్షయ్‌ కుమార్‌ - కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''సూర్యవంశీ''. ఇందులో రణవీర్‌ సింగ్‌ - అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్రలు పోషించారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ - రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ - ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ యాక్షన్ మూవీ గతేడాది మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కేవలం థియేటర్‌లో మాత్రమే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. ఏడాదిన్నర పాటు ఓటీటీకి ఇవ్వకుండా వేచి చూశారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉండటంతో ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అప్పుడెప్పుడో విడుదలైన ''సూర్యవంశీ'' ట్రైలర్ - ప్రచార కార్యక్రమాలను బట్టి ఇది ముగ్గురు హీరోల సినిమా అనుకుంటే పొరపాటే. ఇది అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం. 'సింగం' పాత్రలో నటించిన అజయ్ దేవగన్ మరియు 'సింబా'గా నటించిన రణవీర్ సింగ్ చివరి 30 నిమిషాల్లో మాత్రమే సందడి చేస్తారు. అయితే అదే అర్థ గంట రోహిత్ శెట్టి శైలి హై-ఆక్టేన్ యాక్షన్ - సరికొత్త ఫైట్ సీక్వెన్స్ లు - పల్టీలు కొట్టే ఆటోమొబైల్స్ పేలుళ్లు - యాక్షన్ హీరోల త్రయం చేసే బీభారీ ఫైట్ వంటివి ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

'సూర్యవంశీ' కథ గురించి చెప్పాలంటే.. ఓ ఉగ్రవాద సంస్థ భారత్‌ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేస్తుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) వారిని అరికట్టి బ్లాస్టింగ్స్ జరగకుండా నిరోధించాలి. ముంబై ATS కి నాయకత్వం వహించే డీసీపీ వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్).. వారి ఆచూకీని కనుగొని, దాడులను ఆపే బాధ్యత తీసుకుంటాడు. నేరస్థులను పట్టుకునే పనిలో అతను ఎలా ముందుకు వెళ్తాడు.. అందులో విజయం ఎలా విజయం సాధించాడు అనేది ఈ సినిమా ప్రాథమిక కథాంశం. సబ్‌ ప్లాట్‌ లో సూర్యవంశీకి అతని భార్యా పిల్లలతో ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ ఉంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే, 'సూర్యవంశీ' అసాధారణమైన సస్పెన్స్‌ తో కూడిన గొప్ప స్క్రిప్ట్‌ అయితే కాదు. ఒళ్లు గగుర్పొడిచే ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెలు మిమ్మల్ని విశేషంగా అలరిస్తాయి. సాధారణంగా యాక్షన్ మాస్ మసాలా చిత్రాలలో ప్రేక్షకుడు బుర్రకు పని చెప్పకుండా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. కానీ 'సూర్యవంశీ' లో లెక్కలేనన్ని పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి తెరపై కపిస్తుండటంతో కాస్త అప్రమత్తంగా ఉండి సినిమా చూడాల్సి ఉంటుంది.

దర్శకుడు రోహిత్ శెట్టి సినిమా అంటేనే కామెడీ - మసాలా.. మాస్‌ కి నచ్చే హీరోయిజం - డైలాగ్స్.. వీటన్నింటినీ మించి భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ రోహిత్ అదే ఫాలో అయ్యాడు. సూర్యవంశీతో అతని భార్య రియా (కత్రినా కైఫ్) మరియు వారి కుమారుడు ఆర్యన్‌ తో ఉన్న అనుబంధం.. ATS దళ సభ్యులతో అతని స్నేహం వంటివి చూపిస్తూ సినిమాను క్లైమాక్స్ కు తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ లో వచ్చే టెన్షన్ కు గురి చేసే విషయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. యూనస్ సజవాల్ స్క్రీన్ ప్లే ఆకర్షణీయంగా మరియు గ్రిప్పింగ్‌ గా ఉంది.

'సింగం' సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఇంటెన్స్ గా ఉంటుంది. రణవీర్ యొక్క 'సింబా' పాత్ర చమత్కారంగా ఉంటుంది. అయితే ఇక్కడ 'సూర్యవంశీ' లో అక్షయ్ క్యారక్టర్ ఈ రెండింటి మిశ్రమమని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కఠినంగా ఉంటూ.. మరికొన్ని సీన్స్ లో నవ్వు తెప్పిస్తాడు. అలానే హెలికాప్టర్‌ లో అతని స్మాషింగ్ ఎంట్రీతో విస్మయాన్ని కలిగించాడు. అక్షయ్ - అజయ్ - రణవీర్ ముగ్గురూ తమకు అలవాటైన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కత్రినాకైఫ్ పెర్‌ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో ఫుల్ మార్కులు కొట్టేసింది. ప్రేమగల భార్యగా చురుకైన తల్లిగా కత్రినా మెప్పించింది.

'సూర్యవంశీ' చిత్రానికి మల్టీ కంపోజర్ సౌండ్‌ ట్రాక్ బలహీనంగా ఉంది. ఫుల్ పాపులర్ అయిన రీమిక్స్ సాంగ్ విజువల్ గా ఇంకాస్త బాగా తీయాల్సింది. ఎస్ ఎస్ థమన్ మరియు అమర్ మొహిలే అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సిన అవసరం ఉంది. క్యాస్టింగ్ - యాక్షన్ - క్లైమాక్స్ వంటివి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయితే.. రొటీన్ స్టోరీ - సర్ప్రైజింగ్ సీన్స్ లేకపోవడం డ్రాబ్యాక్స్ గా చెప్పొచ్చు.

ఏదేమైనా దీపావళి పండుగ సందర్భంగా బరిలో దిగిన 'సూర్యవంశీ' టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబడుతోంది. అక్షయ్ కుమార్ - రోహిత్ శెట్టి యాక్షన్ జనాలను థియేటర్లకు రప్పిస్తోంది. 'బెల్ బాటమ్' సినిమాతో తీవ్రంగా నిరాశ పరచగా.. ఈ సినిమాతో అక్షయ్ బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసారనే చెప్పాలి. మరి ఈ ఫెస్టివల్ వీకెండ్ లో ఎన్ని వసూళ్ళు రాబడుతోందో చూడాలి.