Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'శశి'

By:  Tupaki Desk   |   20 March 2021 7:29 AM GMT
మినీ రివ్యూ: శశి
X
యువ హీరో ఆది సాయికుమార్ - సురభి జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''శశి''. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ పై ఆర్‌.పి.వ‌ర్మ - సి.రామాంజ‌నేయులు - చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఒకే ఒక లోకం నువ్వే' అనే పాట విశేషంగా అలరించడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. అలానే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డంతో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నిన్న (మార్చి 19) శుక్రవారం ''శశి'' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..!

కథ విషయానికొస్తే మధ్యానికి బానిసైన రాజ్ కుమార్(ఆది) బాధ్యత లేకుండా, ఎవ‌రిని లెక్క‌చేయ‌కుండా తిరుగుతూ ఉంటాడు. దీంతో కుటుంబ బాధ్యతని తీసుకున్న రాజ్ అన్నయ్య (అజ‌య్) ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ.. త‌మ్ముడిలో మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శశి (సురభి)ని చూసిన రాజ్, ఆమె ఒక స‌మ‌స్యలో చిక్కుకుందని తెలుసుకుంటాడు. శశికి ఉన్న సమస్య ఏమిటి? అసలు రాజ్ కి శశికి సంబంధం ఏమిటి? రాజ్ మద్యానికి బానిస అవడానికి కారణమేంటి? అనేది మిగిలిన కథ.

నిజానికి ఇలాంటి కథలు తెలుగులో అనేకం వచ్చాయి. అన్న కుటుంబ బాధ్యతలు మోస్తుంటే తమ్ముడు బాధ్యత లేకుండా తిరగడం.. హీరో లైఫ్ లో జరిగిన సంఘటనల వల్ల ముందుకు బానిస అవడం వంటివి చూసేసాం. కథలో స్పష్టత లోపించడం.. కథనంలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఔట్ డేటెడ్ కామెడీ మరియు రొటీన్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగింది. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఆడియన్స్ కి ముందే తెలిసినా.. అది ఏమై ఉంటుందో అనే ఆసక్తిని దర్శకుడు కలిగించలేకపోయాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌ తో హీరోహీరోయిన్ల మ‌ధ్య సన్నివేశాలు.. హీరోయిన్ తండ్రి, హీరో మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మెప్పిస్తాయి. రిలీజ్ కి ముందే హైలైట్ అయిన ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది.

నటీనటుల విషయానికొస్తే.. ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న ఆది.. ఈ సినిమాలో కొత్తగా కనిపించడంతో పాటు మెరుగైన నటన కనబరిచాడు. డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించడమే కాకుండా.. తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. ఇక శశి పాత్రలో నటించిన హీరోయిన్ సురభి అందంగా ఉంటూ మంచి నటన కనబరిచింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు, కొన్ని సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ లో సురభి మంచి మార్కులు కొట్టేసింది. అజ‌య్‌ - జ‌య ప్ర‌కాశ్‌‌ - రాజీవ్ క‌న‌కాల త‌మ ప‌రిధి మేర‌కు నటించారు. ఇక ఈ చిత్రంలో సాంకేతిక విలువ‌లు బాగున్నాయి. అరుణ్ చిలువేరు అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. అమ‌ర్‌ నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ బ్యూటిఫుల్ గా చూపించారు. రొటీన్ కథే అయినప్పటికీ దర్శకుడు ఆసక్తి కలిగించే కథనంతో నడిపిస్తే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.