Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'ది వైట్ టైగర్'

By:  Tupaki Desk   |   2 Feb 2021 9:50 AM GMT
మినీ రివ్యూ: ది వైట్ టైగర్
X
బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా జోనస్ - రాజ్ కుమార్ రావు - ఆద‌ర్శ్ గౌర‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కిన చిత్రం ''ది వైట్ టైగ‌ర్''. నెట్‌ ఫ్లిక్స్‌ రూపొందించిన ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ ర‌మిన్ బ‌హ్రాని దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత అర‌వింద్ అడిగా రాసిన 'ది వైట్ టైగ‌ర్' న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ నవల న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా నిలవడమే కాకుండా 2008లో మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుపొందింది. ఇప్పుడు అలాంటి నవల ఆధారంగా తీసిన 'ది వైట్ టైగ‌ర్' చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.

అమెరికాలో చదువుకొని బెంగుళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీపెట్టే ఆలోచనతో తాను ప్రేమించి పెళ్లాడిన పింకీ(ప్రియాంక)తో కలిసి స్వదేశానికి తిరిగి వస్తాడు ఉన్నత కులస్తుడు, భూస్వామ్య కుటుంబీకుడు అయిన అశోక్‌ (రాజ్ కుమార్ రావు). నిమ్నకులానికి చెందిన యువకుడు బలరామ్‌ హల్వాయి (ఆదర్శ్‌ గౌరవ్‌) ఆ ధనవంతుల జంటకు డ్రైవర్ గా చేరతాడు. దీని కోసం అప్పటికే అశోక్‌ కి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తిని తెలివిగా తప్పించి మరీ వారిని యజమానులుగా ఎంచుకుంటాడు. తన యజమాని కోరిక త్వరగా నెరవేరితే తన జీవితం కూడా బాగుపపడుతుందని ఆశపడుతుంటాడు. ఈ నేపథ్యంలో పేదవాళ్లు ధనికులవ్వాలంటే అదృష్టమన్నా ఉండాలి లేదా నేరాలన్నా చేయాలి అని ఆలోచించిన బలరామ్‌.. ధనవంతుడిగా మారడానికి ఎలాంటి పన్నగాలు పన్నాడన్నదే 'వైట్ టైగర్' స్టోరీ.

వైట్ టైగర్ తరానికి ఒక్కసారే పుట్టే జంతువు. ఇందులో వైట్ టైగర్ బలరామ్ గా ఆదర్శ్‌ గౌరవ్‌ మెప్పించాడు. అలానే ప్రియాంక చోప్రా జోనస్ - రాజ్ కుమార్ రావు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇది 'పారసైట్‌' సినిమాను పోలి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నా.. 'వైట్ టైగర్' మన దేశంలో సాంఘిక ఆర్థిక నేపథ్యాన్ని చూపించే సినిమా అని చెప్పవచ్చు. దేశంలోని కుల, మత, ఆర్థిక, స్త్రీ, పురుష అంతరాలన్నిటినీ అంతర్లీనంగా ‘ది వైట్‌ టైగర్‌’లో చర్చించారు.