Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : విజ‌య్ సేతుప‌తి - నిత్యామీన‌న్ '19(1)(ఏ)'

By:  Tupaki Desk   |   2 Aug 2022 3:55 AM GMT
మినీ రివ్యూ : విజ‌య్ సేతుప‌తి - నిత్యామీన‌న్ 19(1)(ఏ)
X
కొంత‌ మంది స్టార్స్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నా మ‌ధ్య‌లో మంచి క‌థ కుదిరితే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ వుంటారు. అలాంటి న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి, నిత్య‌మీన‌న్ ముందు వ‌రుస‌లో నిలుస్తుంటారు. క‌థ ప్ర‌ధానంగా సాగే చాలా సినిమాల‌కు వీరు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. చాలా క‌థ‌ల‌కు ప్రాణం పోశారు. ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించిన మ‌ల‌యాళ మూవీ 19(1)(ఏ). ఇదొక పొలిటిక‌ల్ డ్రామా. యంగ్ లేడీ డైరెక్ట‌ర్ ఇందు వీఎస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఆటో జోసెఫ్‌, నీతా పింటో నిర్మించారు. జూలై 29 నుంచి ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇత‌ర పాత్ర‌ల్లో ఇంద్ర‌జిత్ సుకుమార‌న్‌, ఇంద్ర‌న్స్‌, శ్రీ‌కాంత్ ముర‌ళి, భ‌గ‌త్ మాన్యుయేల్‌, దీప‌క్ ప‌రంబోల్‌, అభిషేక్ ర‌వీంద్ర‌న్‌, అతూల్య ఆషాడం, శ్రీ‌ల‌క్ష్మి, ఆర్య కె సాలీమ్ న‌టించారు.

ఛాయాగ్ర‌హ‌ణం : మ‌నేష్ మాధ‌వ‌న్‌

సంగీతం : గోవింద్ వ‌సంత‌

ఇదొక సెమీ ఫిక్ష‌న‌ల్ మూవీ. య‌దార్ధంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. 19(1)(ఏ) ఏంటీ? అంటే భావ ప్ర‌క‌ట‌న కోసం పౌరుల‌కు భార‌త రాజ్యాంగంలో క‌ల్పించిన హ‌క్కే ఈ ఆర్టిక‌ల్ 19(1)(ఏ). ఈ మ‌ధ్య భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై దాడులు జ‌రుగుతూనే వున్నాయి. ఆ దాడుల‌నే ప్ర‌ధానంగా చూపిస్తూ ఈ సినిమాని ద‌ర్శ‌కురాలు చాలా ప్ర‌భావ‌వంతంగా రూపొందించింది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో అభ్యుద‌య ర‌చ‌యిత‌, జ‌ర్న‌లిస్ట్, యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ హ‌త్య ను ఉద్దేశించి ఈ సినిమాని రూపొందించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ జ‌ర్న‌లిస్ట్ హ‌త్య‌ని ఖండిస్తూ ఇప్ప‌టికీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కేంద్రంలో వున్న బీజేపీ పై విమ‌ర్శ‌లు చేస్తూనేఉన్నారు.

ఇక క‌థ‌లోకి వెళితే... సినిమాలోని ఈ పాత్ర‌ని కాస్త మేల్ గా మార్చి ఆ పాత్ర‌ని త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి చేత చేయించారు. ఇది త‌న‌కు మ‌ల‌యాళంలో సెకండ్ ఫిల్మ్‌. సినిమా అంతా కేర‌ళ నేప‌థ్యంలో సాగుతుంది. విజ‌య్ సేతుప‌తి పాత్ర పేరు గౌరీ శంక‌ర్‌. మ‌ల‌యాళ అభ్యుద‌య ర‌చ‌యితగా క‌నిపిస్తాడు. జిరాక్స్ సెంట‌ర్ ను న‌డిపే మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌తిగా నిత్య‌మీన‌న్ న‌టించింది. మ‌ద్యానికి బానిసైన తండ్రి ఇంటికే ప‌రిమితం కావ‌డంతో విధిలేక జిరాక్స్ షాప్ న‌డుపుతూ పెళ్లికి, చ‌దువుకూ దూర‌మై చాలా దుర్బ‌ర‌మైన జీవితాన్ని సాగిస్తూ వుంటుంది. ఈ పాత్ర‌లో నిత్యామీన‌న్ శ‌భాష్ అనిపించింది.

త‌మిళ‌నాడులోని స్వ‌గ్రామం ధ‌ర్మ‌పురికి వెళుతున్న క్ర‌మంలో త‌న ర‌చ‌న‌ను టైప్ చేసి పెట్ట‌మ‌ని, అందుకు కొంత‌ ఆల‌స్య‌మైనా ఫ‌ర‌వాలేద‌ని నిత్య‌కు ఇచ్చేసి త‌న స్వ‌గ్రామానికి ప‌య‌న‌మ‌వుతాడు గౌరీ శంర్‌. అత‌ను ఎవ‌రో త‌న‌కు తెలియ‌దు..కానీ త‌ను తిరిగి వ‌స్తే టైపింగ్ చేసిన డ‌బ్బులు వ‌స్తాయ‌ని ఆశ‌గా ఎదురుచూస్తూ వుంటుంది నిత్య‌. మ‌రుస‌టి రోజు గౌరీశంక‌ర్ హ‌త్య‌కు గురైన‌ట్టుగా టీవీలో చూపిస్తుంటారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌న్ని కాల్చి చంపార‌ని టీవీ న్యూస్ లో చూపిస్తూ వుంటారు. అప్పుడే గౌరీశంక‌ర్ గురించి నిత్య‌కు త‌నెవ‌రో తెలుస్తుంది.

ఇంత‌లో గౌరీశంక‌ర్ హ‌త్య‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు ర‌గులుతుంటాయి. అయితే క‌రుడుగ‌ట్టిన జాతీయ‌వాదులు గౌరీ శంక‌ర్ ని హ‌త్య‌ చేశార‌ని వార్త‌లు వినిపిస్తుంటాయి. పోలీసులు హ‌త్య‌పై ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఈ క్ర‌మంలో పోలీసులు గౌరీ శంక‌ర్ ర‌చ‌న‌ల‌ని ప‌బ్లిష్ చేసిన ప‌బ్లీష‌ర్ ని ప్ర‌శ్నిస్తారు. ఆ విచార‌ణ క్ర‌మంలో ద‌ర్శ‌కురాలు గౌరీశంక‌ర్ పాత్ర వ్య‌క్తిత్వాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ఇక నిత్య పాత్ర గురించి చెప్పాలంటే అభ్యుద‌య భావాలు గ‌ల ర‌చ‌యిత త‌న చివ‌రి ర‌చ‌న‌ని త‌న చేతిలో పెట్టి వెళ్లాడ‌ని దాన్ని ఎలాగైనా చేరాల్సిన చోటికి చేర్చాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అత‌డి కుటుంబంతో పాటు ప‌బ్లిష‌ర్ కు కూడా పంపిస్తుంది. అనంత‌రం నిత్య త‌న క‌లని సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేయ‌డంతో సినిమా ఎండ్ అవుతుంది.

ఈ సినిమా నిడివి 1గంట 47 నిమిషాలు మాత్ర‌మే. ఇంత చిన్న క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంతో ద‌ర్శ‌కురాలు త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింది. క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌ల్లో విజ‌య్ సేతుప‌తి, నిత్యామీన‌న్ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో న‌టించే వీరు ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం నిజంగా అభినంద‌నీయం. మ‌నేష్ మాధ‌వ‌న్ ఛాయాగ్ర‌హ‌ణం, గోవింద్ వ‌సంత సంగీతం స‌హ‌జ శైలిలో సాగాయి. అంతే కాకుండా చాలా స‌బ్ ప్లాట్లు సినిమాలు సాగిన తీరు ఫ‌ర‌వాలేద‌నిపిస్తాయి. మొత్తానికి ఓ సీరియ‌స్ ఇష్యూని వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.