Begin typing your search above and press return to search.

'చిత్ర‌పురి' ముందు మినీ ట్యాంక్ బండ్-ఫైవ్ స్టార్!!

By:  Tupaki Desk   |   29 July 2019 4:48 AM GMT
చిత్ర‌పురి ముందు మినీ ట్యాంక్ బండ్-ఫైవ్ స్టార్!!
X
సినిమా 24 శాఖ‌ల కార్మికులు కొలువుండే చిత్ర‌పురి కాల‌నీ ప‌రిస‌రాలు హైద‌రాబాద్ న‌గ‌రానికే త‌ల‌మానికంగా అభివృద్ధి చెంద‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చిత్ర‌పురి ప‌రిస‌రాలు అంత‌కంత‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుతుండ‌డంపైనా ఫిలింస‌ర్కిల్స్ లో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఈ ప‌రిస‌రాల్లో 20వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండ‌డంపై సినీవ‌ర్గాల్లో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి హార్ట్ ఆఫ్ ది సిటీగా పాపుల‌రైన గ‌చ్చిబౌళి -రింగ్ రోడ్ ప‌రిస‌రాల‌కు అత్యంత చేరువ‌గా ఉండ‌డం ఈ కాల‌నీకి పెద్ద ప్ల‌స్ అవుతోంది. విజ‌య‌వాడ‌- బెంగ‌ళూరు హైవేకు క‌నెక్ట‌య్యే రింగ్ రోడ్ కి కేవ‌లం 3 నిమిషాల దూరంలో ఈ కాల‌నీ ఉండ‌డం.. సాఫ్ట్ వేర్ కంపెనీల‌కు కూత‌వేటు దూరంలోనే ఈ ఏరియా అందుబాటులో ఉండ‌డంతో ఇక్క‌డ ఇండ్ల‌లో అద్దెలు అమాంతం పెర‌గ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. చిత్ర‌పురిని అనుకుని ముంబై హైవే ఏరియా- రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో వంద‌ల‌ ఎక‌రాల్లో రూ.30,000 కోట్ల విలువ చేసే సింగ‌పూర్ ని త‌ల‌పించే రేంజులో ఆకాశ హార్మ్యాల్ని నిర్మిస్తుండ‌డం.. అవ‌న్నీ ప్ర‌స్తుతం స్ప‌ష్ట‌మైన‌ రూపు రేఖ‌ల్ని సంత‌రించుకుని క‌నిపిస్తుండ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వ‌ర‌ల్డ్ క్లాస్ బెస్ట్ కార్పొరెట్ కంపెనీల‌న్నీ ఈ ప‌రిస‌రాల్లో ఆఫీస్ స్పేస్ కోసం చూస్తుండ‌డంతో ఇక్క‌డ వంద‌ల-వేల‌ కోట్ల ప్రాజెక్టులకు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టికే స్కైని ట‌చ్ చేసే భవంతుల నిర్మాణం జ‌రుగుతోంది. దీంతో ఈ ఏరియా అత్యంత కాస్ట్ లీ హ‌బ్ గా మారింది.

వ‌ర‌ల్డ్ బెస్ట్ కాస్ట్ లీ సిటీగా ఇప్ప‌టికే హైద‌రాబాద్ పాపుల‌ర‌వుతోంది. ఇక గ‌చ్చిబౌళిని ఆనుకుని ఉండ‌డంతో ఈ ప్రాంతం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని ఫిలిం వ‌ర్గాల్లో ముచ్చ‌ట సాగుతోంది. న‌గ‌రంలోనే ది బెస్ట్ కార్పొరెట్ ఏరియాగా చిత్ర‌పురి ప‌రిస‌రాలు రూపాంత‌రం చెందుతుండ‌డం అంద‌రికీ షాకిస్తోంది. ఈ అభివృద్ధి అంతా కేవ‌లం ఈ నాలుగైదేళ్ల‌లోనే చూస్తుండ‌గానే ఈ మార్పు అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ క్లాస్ కార్పొరెట్ బ‌డా కంపెనీలు ప్ర‌స్తుతం చిత్ర‌పురి ప‌రిస‌రాల్లో భారీ నిర్మాణాలు చేప‌డుతున్నాయి. ఈ ప్రాంత‌ రూపురేఖ‌ల్ని మార్చేస్తున్నాయి. కొన్ని వంద‌ల‌ సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ‌ కొండ‌లు- బండ‌లు రాళ్లు గుట్ట‌ల‌తో వృధాగా ప‌డి ఉన్న ఏరియా ప్ర‌స్తుతం మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని త‌ల‌పిస్తోంది. కేవ‌లం ఈ నాలుగైదేళ్లలోనే ఈ స్థాయిలో ఊహించ‌ని అభివృద్ధి జ‌ర‌గ‌డంపై సినీమీడియాలోనూ ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

చిత్ర‌పురిని ఆనుకుని ఈశాన్యంలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ చెరువును తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 22-30 కోట్ల మేర పెట్టుబ‌డుల్ని పెడుతున్నార‌ని తాజాగా తెలుస్తోంది. దీంతో పాటు చిత్ర‌పురి కాల‌నీకి- చెరువుకు మధ్య ఉన్న ఏడెనిమిది ఎక‌రాల స్థ‌లంలో ఫైవ్ స్టార్ హోట‌ల్ నిర్మాణం చేప‌ట్ట‌నున్నార‌ని కాల‌నీ వాసులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 200-300 కోట్ల మేర పెట్టుబ‌డుల్ని పెట్టేందుకు ఓ ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. స‌ద‌రు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకే చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను అప్ప‌గించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఫైవ్ స్టార్ హోట‌ల్ నిర్మాణానికి ఇప్ప‌టికే అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని తెలుస్తోంది. అందుకు ప్ర‌తిగా స‌ద‌రు రియ‌ల్ ఎస్టేట్ ఫ‌ర్మ్ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు సాయం చేస్తోంద‌ట‌. చిత్ర‌పురి ముందు 200కోట్ల ప్రాజెక్ట్ అంటూ కాల‌నీ వాసులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చి ఇందులో దుబాయ్ త‌ర‌హాలో వాట‌ర్ బోటింగ్.. ఇత‌ర వినోదానికి సంబంధించిన‌ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. ఇందులోనే ఓ భాగాన్ని స్విమ్మింగ్ పూల్ గానూ మారుస్తున్నారు. చెరువును కొంత‌మేర మ‌ట్టితో క‌ప్పి ఎంట్రన్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. చెరువు చుట్టూ వాక్ వేను ఇప్ప‌టికే రెడీ చేస్తున్నారు. ఈ ప‌రిస‌రాల్ని కేబీఆర్ పార్క్- ఇందిరా పార్క్ త‌ర‌హాలోనే ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతుండడం .. చుట్టూ మొక్క‌ల పెంప‌కం వంటి కార్య‌క్ర‌మాల్ని చేప‌డుతున్నారు.

ఉన్న‌ట్టుండి ఇక్క‌డ అభివృద్ధితో రూపురేఖ‌లు మారిపోవ‌డ‌మే కాదు.. ఇండ్ల ధ‌ర‌లు.. అద్దెలు చుక్కల్ని తాక‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇక్క‌డ ప‌రిస‌రాల్లో చుట్టుప‌క్క‌ల 30-40 రియ‌ల్ వెంచ‌ర్లు అందుబాటులో ఉన్నా ఖ‌రీదు మాత్రం చుక్క‌ల్ని తాకుతుండ‌డంపై బెంబేలెత్తే ప‌రిస్థితి. డ‌బుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ ధ‌ర కోటి ధ‌ర ప‌లుకుతుండ‌గా ట్రిపుల్ బెడ్ రూం కొనాలంటే కోటిన్న‌ర ప‌లుకుతోంది. ఇక సింగిల్ బెడ్ రూమ్ లు ఈ ప‌రిస‌రాల్లో అందుబాటులోనే లేవు. ఇప్ప‌టికే చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ ఫ‌ర్మ్స్ వంద‌ల వేల కోట్ల ప్రాజెక్టుల్ని నిర్మిస్తూ భారీగా ఆర్జిస్తుండ‌డంపైనా జ‌నం నోరెళ్ల బెడుతున్నారు. అయితే ఇలా ధ‌ర‌లు పెర‌గడానికి కార‌ణం కూత‌వేటు దూరంలోనే అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండ‌డ‌మే. చిత్ర‌పురిలో కైరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్.. ఆ ప‌క్క‌నే దిల్లీ ప‌బ్లిక్ స్కూల్.. ఓక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్.. ఒయాసిస్ స్కూల్ ఇవ‌న్నీ ఎంతో ఫేమ‌స్. వీటితో పాటు అన్నిర‌కాల కార్పొరెట్ ఆస్ప‌త్రులు.. ఇత‌ర‌త్రా మార్కెట్లు.. మ‌ల్టీప్లెక్సులు.. సినిమా థియేట‌ర్లు ఇక్క‌డ కూత‌వేటు దూరంలోనే అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం నాన‌క్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోకి స‌న్న‌ని మ‌ట్టిరోడ్ లో సాయంత్రం ఆరు త‌ర్వాత చీక‌ట్లో వెళ్లాలంటే జ‌నం భ‌య‌ప‌డేవారు. అలాంటిది ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఊహించ‌ని ఈ అభివృద్ధికి అంద‌రూ షాక్ తింటున్నారు.