Begin typing your search above and press return to search.

మనసుకు మేకు కొట్టారు..ఆర్జీవీ డ్రెస్సింగ్ పై మంత్రి కామెంట్స్..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:40 PM GMT
మనసుకు మేకు కొట్టారు..ఆర్జీవీ డ్రెస్సింగ్ పై మంత్రి కామెంట్స్..!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ ధరల అంశం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కారును ఉద్దేశిస్తూ మీడియా - సోషల్ మీడియాలో ఆర్జీవీ పలు ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయ్యారు. సినిమా టికెట్ మీద తన వెర్షన్ కు ప్రభ్యత్వానికి వినిపించారు.

అయితే ఏపీ మంత్రితో సమావేశానికి వెళ్ళినప్పుడు రామ్ గోపాల్ వర్మ గెటప్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంతో ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడటానికి ఆర్జీవీ భిన్నమైన వస్త్రధారణలో వెళ్లారు. దర్శకుడు రెడ్ జాకెట్ - టాన్ జీన్స్ - గోల్డ్ కలర్ షూస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే మినిస్టర్ తో మీటింగ్ కు విచిత్రమైన డెస్సింగ్ లో ఎందుకు వెళ్లారో లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో వర్మ వివరణ ఇచ్చారు.

''నేను ఈ ఇష్యూని వోడ్కా తాగుడుతో స్టార్ట్ చేసా.. దాని తర్వాత అమ్మాయిలతో డాన్స్ చేస్తా.. నేల మీద పొర్లుతా.. ఇవన్నీ చేసినంత మాత్రాన మీ దగ్గర నాలెడ్జ్, తెలివి లేదని అనుకోకండిరా సుబ్బారావుల్లారా అని చెప్పడానికి చేసా'' అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

''లైఫ్ ఎంజాయ్ చేస్తూ కూడా సీరియస్ గా ఉండొచ్చు. ఇప్పటి వరకు నేను దీనిపైన ఎంతో స్టడీ చేసి సీరియస్ గానే చర్చిస్తూ వచ్చాను. తెల్ల బట్టలేసుకుని ఫార్మల్ గా మాట్లాడినంత మాత్రాన మీకు తెలిసినట్లు కాదు.. ఇలా గోల్డ్ షూస్ వేసుకుని వోడ్కా తాగి అమ్మాయిల కాళ్ళకు దండం పెడతా నేల మీద పొర్లినంత మాత్రాన తెలియదని కాదు. ఈ రెండింటిని కలపకండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అలా వెళ్ళాను'' అని వర్మ వివరించారు.

ఇంకా మాట్లాడుతూ.. ''సెక్రటేరియట్ లోకి వెళ్ళగానే నాని గారు అయితే ‘మనసుకు మేకు కొట్టారు’ అని అన్నారు. అది నాకు అర్థం కాలేదు. నిజంగా ఆయన నా బట్టల మీద కామెంట్ చేసారని కూడా నాకు తెలియదు. మనసుకు మేకు కొట్టారు లాంటివి నేనెప్పుడూ వినలేదు. ఆయన ఉద్దేశ్యంలో మీ వేషధారణ నచ్చింది అని తర్వాత తెలిసింది'' అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ చెప్పిన సచివాలయంలో భేటీ ముచ్చట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే మంత్రి పేర్ని నానితో సమావేశం పూర్తిగా సంతృప్తికరంగా సాగిందని రాంగోపాల్ వర్మ మీడియాకు తెలియజేశారు. అయితే మళ్ళీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఆర్జీవీ ఎలాంటి అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతారో చూడాలి.