Begin typing your search above and press return to search.

హీరో నాని కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని రియాక్షన్..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 11:30 AM GMT
హీరో నాని కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని రియాక్షన్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను ఉద్దేశిస్తూ హీరోలు నాని - సిద్దార్థ్ చేసిన కామెంట్స్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని దీనికి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏ ఊర్లో ఏ సినిమా హాల్ పక్కన ఉన్న కిరాణా షాప్ లెక్కల గురించి మాట్లాడారో తనకు తెలియదని.. తెలిసిన తర్వాత మాట్లాడొచ్చని మంత్రి అన్నారు. స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగానే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను.. సినిమా థియేటర్ కౌంటర్ - పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్ లను లెక్కగట్టి చెప్పి ఉండొచ్చు అని పేర్ని నాని సెటైర్‌ వేశారు.

ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ ట్వీట్స్ పై పేర్ని నాని స్పందిస్తూ.. చెన్నైలో ఉండే ఆయన బహుశా తమిళనాడు సీఎం స్టాలిన్ గురించి వాళ్ళ మంత్రుల గురించో.. మోడీ గారి గురించో అనుంటాడేమో అని ఎద్దేవా చేశారు. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌.. ఇక్కడ తాము విలాసంగా బ్రతుకుతున్నామో అనేది ఎప్పుడైనా చూసాడా? అయినా తమిళనాడులో జీవిస్తూ.. ఏది కొనుకున్నా అక్కడే ట్యాక్స్ లు కట్టే వ్యక్తికి.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని మంత్రి ప్రశ్నించారు.

కాగా, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం మీద 'శ్యామ్ సింగరాయ్' ప్రెస్ మీట్ లో హీరో నాని కీలక వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. థియేటర్ కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదని నాని అభిప్రాయ పడ్డారు. దీనికి మినిస్టర్ నాని స్పందిస్తూ అసలు నాని ఎవరో తెలియదని.. తనకు తెలిసింది కొడాలి నాని ఒక్కరే అని అన్నారు.

ఏపీ మంత్రి కొడాలి నాని కూడా హీరో నాని వ్యాఖ్యలపై స్పందించిన సంగతి తెలిసిందే. 'నిజంగా బడ్డీ కొట్టుకు వచ్చిన కలెక్షన్స్ సినిమా వాళ్లకు రాకపోతే వాళ్లు కూడా బడ్డీ కొట్టులే పెడతారు కదా?' అని ప్రశ్నించారు. ''ఎవరైనా ఆదాయం కోసమే వ్యాపారం చేస్తారు. ఒకవేళ నిజంగా సినిమా హీరోకో డిస్ట్రిబ్యూటర్ - థియేటర్ యజమానులకు బడ్డీ కొట్టుకు వచ్చే రెండు మూడు వేల ఆదాయం రాకపోతే.. అందరూ సినిమాలు వదిలేసి అవే పెడతారు కదా?. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కొంతమందికి ద్యేషం ఉంటుంది.. అందుకే ఆయన మంచి చేసినా వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు'' అని కొడాలి నాని అన్నారు.

అయితే నాని చేసిన వ్యాఖ్యలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరని నిర్మాత దిల్ రాజు అన్నారు. ''నాని చేసిన రెండు సినిమాలు ఓటిటీ కి వెళ్లి వచ్చాకా ఇప్పుడు తన సినిమా థియేటర్లో రిలీజ్ కావడం, ఇలాంటి సమయంలో టికెట్ ఇష్యూ రావడం వలన, ఒక హీరోగా కష్టపడే మనస్తత్వంతో ఉన్న నాని ఎమోషనల్ అయ్యి అలా రియాక్ట్ అయ్యాడు. తను చెప్పిన ఫీలింగ్ వేరు.. అందరికి కమ్యూనికేట్ అయిన విధానం వేరు'' అని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.

''నాని చెప్పిన మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్నది ఎంతమంది.. సినిమాలకు, ప్రేక్షకులకు ప్రభుత్వానికి మధ్య ఉన్న గోడ మీడియా.. మీరు ఏది చూపిస్తే అదే ప్రేక్షకులకు చూస్తారు. అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నాని బాధ వేరు.. రెండు సినిమా ల తరువాత వస్తున్నా సినిమా కాబట్టి ఆ మాత్రం రియాక్ట్ కావాల్సిన అవసరం తనకుంది. అందుకే తను రియాక్ట్ అయ్యాడు.. అంతేకాని నెగెటివ్ గా రిచ్ అయ్యేలా మాత్రం నాని మాట్లాడలేదు. అర్ధం చేసుకోండి'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.